SEBI: రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోటర్‌పై నిషేధం విధించిన సెబీ

by S Gopi |

కంపెనీ చూపించిన మొత్తం ఆదాయంలో దాదాపు 99.8 శాతం కేవలం కాగితాల మీదే సృష్టించబడిందనే అనుమానాలు మార్కెట్‌ను భయపెడుతున్నాయి.

SEBI: రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోటర్‌పై నిషేధం విధించిన సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మూలధన మార్కెట్ (క్యాపిటల్ మార్కెట్) చరిత్రలోనే అత్యంత షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్' ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మెహతాపై మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' తాత్కాలిక నిషేధం విధించింది. కంపెనీ తన వ్యాపార లెక్కల్లో ఊహించని స్థాయిలో మోసాలకు పాల్పడిందనే ప్రాథమిక ఆధారాలతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. 2021-2025 మధ్యకాలంలో ఈ కంపెనీ తన అనుబంధ సంస్థల (సబ్సిడియరీలు) ద్వారా ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల మేర తప్పుడు లేదా అదనపు ఆదాయాన్ని చూపించి ఉండవచ్చని సెబీ గుర్తించింది. అంటే కంపెనీ చూపించిన మొత్తం ఆదాయంలో దాదాపు 99.8 శాతం కేవలం కాగితాల మీదే సృష్టించబడిందనే అనుమానాలు మార్కెట్‌ను భయపెడుతున్నాయి.

ఒక చిన్న ఫిర్యాదుతో బయటపడ్డ పెద్ద గుట్టు!

అసలు ఈ కథ ఎలా మొదలైందంటే.. కంపెనీకి రావలసిన బాకీలు (ట్రేడ్ రిసీవబుల్స్) బుక్స్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఒక వాటాదారుడు (షేర్‌హోల్డర్) చేసిన ఫిర్యాదుతో సెబీ అలర్ట్ అయింది. దీనిపై లోతైన దర్యాప్తు కోసం 'బిడో ఇండియా' అనే ప్రత్యేక ఆడిటింగ్ సంస్థను రంగంలోకి దించింది. అయితే విచారణ సమయంలో కంపెనీ యాజమాన్యం తమ అకౌంటింగ్ రికార్డులను, కంప్యూటర్ డేటాను, ఏ కస్టమర్‌కు ఎంత అమ్మారనే వివరాలను ఆడిటర్లకు ఇవ్వకుండా దాటవేసిందని సెబీ ఆరోపించింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లో ఉన్న తమ అనుబంధ సంస్థల నుంచి వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు బిల్లులు చూపించారు కానీ, దానికి సంబంధించిన ఎలాంటి గట్టి ఆధారాలు ఆడిటింగ్ బృందానికి సమర్పించలేదు.

సొంత మనుషులతోనే వేల కోట్ల లావాదేవీలు!

ఈ అకౌంటింగ్ మాయాజాలంతో పాటు, 2022-2024 మధ్య కాలంలో రూ.11,400 కోట్లకు పైగా జరిగిన కొన్ని అంతర్గత లావాదేవీలను (రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్) కూడా సెబీ అనుమానాస్పదంగా గుర్తించింది. అంటే కంపెనీకి సంబంధించిన సొంత వ్యక్తులు లేదా సంస్థల మధ్యే ఈ నిధులు చేతులు మారినట్లు తేలింది. ఈ అక్రమాలన్నింటినీ వివరిస్తూ సెబీ ఏకంగా 109 పేజీలతో కూడిన ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజేష్ మెహతా షేర్ మార్కెట్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకుండా బ్రేక్ వేసింది. ఈ వార్త బయటకు రావడంతోనే ఇన్వెస్టర్లు భయపడి షేర్లను అమ్మేయడంతో, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు ఒకేరోజు 5 శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

కంపెనీ స్పందన

మరోవైపు ఈ సంచలన ఆరోపణలను రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ యాజమాన్యం పూర్తిగా ఖండించింది. తమ కంపెనీ ఆదాయ లెక్కలన్నీ వంద శాతం కరెక్ట్‌గా ఉన్నాయని, సెబీకి తమకు మధ్య జరిగిన కొన్ని సమాచార లోపాల వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని కంపెనీ సమర్థించుకుంటోంది. అయితే, ఇంత పెద్ద కంపెనీపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం సాధారణ పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసింది. రాబోయే రోజుల్లో సెబీ పూర్తి స్థాయి విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయోనని మార్కెట్ వర్గాలు గమనిస్తున్నాయి.

Next Story