ATM Charges: మే 1 నుంచి పెరగనున్న ఏటీఎం లావాదేవీలు

by S Gopi |

ఉచిత లావాదేవీ పరిమితుల్లో సవరణ, పరిమితి మించిన లావాదేవీల ఛార్జీలను సర్దుబాటి చేయడం, ఇతర సర్దుబాట్లపై దృష్టి సారించాయి.

ATM Charges: మే 1 నుంచి పెరగనున్న ఏటీఎం లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటీఎం లావాదేవీలు ఇకపై భారం కానున్నాయి. ఒక నెలలో ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై రూ.23 చొప్పున వసూలు చేసుకునేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) బ్యాంకులకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. పెరిగిన ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే బ్యాంకులు ఆర్‌బీఐ మార్గదర్శకాల ఆధారంగా ఉచిత లావాదేవీ పరిమితుల్లో సవరణ, పరిమితి మించిన లావాదేవీల ఛార్జీలను సర్దుబాటి చేయడం, ఇతర సర్దుబాట్లపై దృష్టి సారించాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), కోటక్ బ్యాంకులతో సహా ఇతర బ్యాంకులు మే 1 నుంచి పరిమితి దాటిన ఏటీఎం లావాదేవీలపై ఛార్జీల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు వినియోగదారులకు సమాచారం గురించి తెలియజేశాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఫిబ్రవరిలోనే కొత్త ఛార్జీల వివరాలను ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఇటీవల మే 1 నుంచి కొత్త ఏటీఎం లావాదేవీల ఛార్జీలు అమలు చేస్తామని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. నెలలో ఉచిత పరిమితులు దాటిన తర్వాత ఏటీఎం లావాదేవీల రుసుము రూ. 23, అదనంగా పన్నులు వసూలు చేయనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొంత ఏటీఎంలలో చేసే లావాదేవీలు, నగదు విత్‌డ్రాలకు మాత్రమే ఛార్జీలు అమలు చేస్తోంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, పిన్ నంబర్ మార్పు వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో వీటికి ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంకు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) సైతం పరిమితి మించిన లావాదేవీలకు రూ. 23 వసూలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీలకు కస్టమర్ ఛార్జీలు ఆర్థిక లావాదేవీకి రూ.23, ఆర్థికేతర లావాదేవీకి రూ. 11గా నిర్ణయించింది. ఇండస్ఇండ్ బ్యాంకు కూడా ఇతర బ్యాంకు ఏటీఎంలలో చేసిన నగదు విత్‌డ్రాలకు, ఉచిత పరిమితి దాటి తర్వాత రూ. 23 వసూలు చేస్తామని అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. మే 1 నుంచి కొత్త ఛార్జీలు అమలవుతాయని పేర్కొంది.

Next Story