Jewellery Stocks: ప్రధాని మోదీ విజ్ఞప్తితో పసిడి షేర్ల భారీ పతనం

by S Gopi |   (  Updated:2026-05-12 08:40:06  IST  )

టైటాన్ షేరు దాదాపు 7 శాతం పడిపోగా, కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా నష్టపోయింది.

Jewellery Stocks: ప్రధాని మోదీ విజ్ఞప్తితో పసిడి షేర్ల భారీ పతనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ అనిశ్చితి, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 'బంగారం కొనుగోళ్లు తగ్గించండి' అని విజ్ఞప్తి చేయడం మార్కెట్లలో పెద్ద చర్చకు దారితీసింది. అనవసర దిగుమతులు, విదేశీ ప్రయాణాలు, అధిక ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని మోదీ ప్రజలను కోరారు. ఈ క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్లలో జ్యువెలరీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి. టైటాన్ షేరు దాదాపు 7 శాతం పడిపోగా, కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా నష్టపోయింది. సెన్కో గోల్డ్, స్కై గోల్డ్ వంటి ఇతర కంపెనీలు కూడా 10-12 శాతం వరకు క్షీణించాయి. ప్రధాని మోదీ విజ్ఞప్తి కారణంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే భయం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. అయితే, స్థానిక బంగారం మార్కెట్‌లో మాత్రం ఇప్పటివరకు పెద్ద మార్పు కనిపించలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల దేశీయంగా బంగారం ధరలు సోమవారం క్షీణించాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 600కి పైగా తగ్గి రూ. 1,51,920కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 220 తగ్గి రూ. 1,53,550 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 200 తగ్గి రూ. 1,40,650కి చేరింది. వెండి కిలో రూ. 2.85 లక్షలుగా ఉంది.

Next Story