- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI: ఏఐతో ఆదాయం ఆర్జిస్తున్నారు
ఏఐతో కలిసి పనిచేసేందుకు తమ స్కిల్స్ పెంచుకున్న వారు ఎక్కువ ప్రయోజనాలు పొందినట్టు నివేదిక స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలినెస్(ఏఐ) సాధారణ వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని, ముఖ్యంగా గణనీయమైన సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు ఉండవంటూ రకరకాల ఆందోళనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఏఐ మానవ జీవితంతో ఎంత విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందో, దానికి అనుగుణంగా కొన్ని ఉద్యోగాలు పోతాయి, కొత్తవి పుట్టుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంక్‌బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఏఐ ఇప్పటికే చాలామంది ఉద్యోగుల ఆర్థిక జీవితాలను మెరుగుపరిచిందని తేల్చింది. ఈ నివేదిక ప్రకారం, 22 నుంచి 45 ఏళ్ల వయస్సున్న ఉద్యోగుల్లో 40 శాతం కంటే ఎక్కువ మంది ఇప్పటికే ఏఐ కారణంగా తమ ఆదాయం, ఉత్పాదకత పెరిగిందని స్పష్టం చేస్తున్నారు.
స్కిల్స్‌తో ప్రయోజనాలు
ఏఐ సాధనాలు ఎక్కువ ఆదాయం ఆర్జించేందుకు, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయ పడుతున్నాయని 42 శాతం మంది చెప్పారు. ఇదే సమయంలో ఏఐ సంబంధిత మార్పుల వల్ల తమ ఆదాయంపై ప్రభావం పడిందని 12 శాతం మంది చెప్పగా, 8 శాతం మంది ఏఐ టూల్స్‌పై ఎక్కువ ఆధారపడటం వల్ల ఆర్థికంగా నష్టపోయినట్టు తెలిపారు. అయితే, ఏఐతో కలిసి పనిచేసేందుకు తమ స్కిల్స్ పెంచుకున్న వారు ఎక్కువ ప్రయోజనాలు పొందినట్టు నివేదిక స్పష్టం చేసింది. చాలామంది కెరీర్ మధ్యలో ఉన్న ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాల్లో ఏఐని ఉపయోగించడం వల్ల పనితీరు గతంలో కంటే బాగుందని ఎక్కువ మంది ఉద్యోగులు అంగీకరిస్తున్నారు. మరోవైపు, ఏఐ-సంబంధిత స్కిల్స్ లేదా అందుకు తగిన ప్రణాళిక లేనివారు తమ ఆదాయంపై ఆశలు సన్నగిల్లుతున్నట్టు చెబుతున్నారు.
కంపెనీలు కూడా..
ఉద్యోగులతో పాటు కంపెనీలు కూడా క్రమంగా ఏఐ వినియోగాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయని మరో నివేదికలో తేలింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలు ఏఐ ఉపయోగించి, కార్యకలాపాలను విస్తరించి ఆదాయం ఆర్జిస్తున్నాయి. సేల్స్‌ఫోర్స్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, ఆటోమేటెడ్ సర్వీస్ చాట్‌బాట్స్, మార్కెటింగ్, కంటెంట్ కోసం కంపెనీలు ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏఐ కోసం చేసిన ఈ ఖర్చు ద్వారా తమ ఆదాయం గణనీయంగా పెరిగిందని 90 శాతానికి పైగా కంపెనీలు స్పష్టం చేశాయి.
చిన్న కంపెనీలు ఏఐ సంబంధిత టెక్నాలజీని ఉపయోగించి బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్ విభాగాలను మునుపటి కంటే సమర్థవంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా అటానమస్ ఏజెంట్ల ద్వారా తమ పనులు మరింత సులభతరం అయినట్టు కంపెనీ వెల్లడించాయి. ఇదే సమయంలో అనుకున్న సమయానికి ఏఐని అందుకోక వెనుకబడ్డామని సుమారు 40 శాతం కంపెనీలు భావిస్తుండగా, అత్యంత వేగంగా మారుతున్న టెక్నాలజీకి తగినట్టు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం సవాలుగా ఉందని సగానికి పైగా కంపెనీలు తెలిపాయి. మొత్తంగా ఏఐ యుగంలో ఎంత వేగంగా ఆలోచిస్తే రాణించగలమో అంచనాకు రావాలని, అందుకు తగ్గట్టు పనిచేసేందుకు సిద్ధపడాలని నివేదిక అభిప్రాయపడింది. అయితే, భద్రత, నిబంధనలకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది.






