- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AI Scam: ట్రంప్ ఏఐ వీడియోతో స్కామ్.. మోసపోయిన 200 మంది
ట్రంప్ ఏఐ వీడియో ద్వారా దాదాపు 200 మంది నుంచి రూ. 2 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఏఐ ద్వారా జరిగే మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈసారి ఏకంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతోనే భారీ స్కామ్ జరిగింది. అది కూడా మనదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు కర్ణాటకలో డొనాల్డ్ ట్రంప్‌తో కూడిన ఏఐ వీడియో ద్వారా దాదాపు 200 మంది నుంచి రూ. 2 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఘటన కలకలం రేపుతోంది. ట్రంప్‌నకు చెందిన హోటల్ షేర్లలో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు పొందవచ్చని చెబుతున్న వీడియోను సైబర్ మోసగాళ్లు రూపొందించారు. తక్కువ సమయంలో ఎక్కువ రివార్డులు పొందవచ్చనే అత్యాశ చూపి వారందరి నుంచి డబ్బులు కొల్లగొట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సైబర్ కేసులు ఎక్కువగా బెంగళూరు, తుముకూరు, మంగళూరు, హవేరిలలో నమోదయ్యాయి. ఒక్క హవేరిలోనే 15 మందికి పైగా ఈ స్కామ్‌లో డబ్బు పోగొట్టుకున్నారు. 'డోనాల్డ్ ట్రంప్ రెంటల్ యాప్' ద్వారా సైబర్ మోసగాళ్లు మొదట్లో ఖాతాలు తెరిచేందుకు రూ. 1,500 చెల్లించాలని, ఆ తర్వాత అధిక లాభాలు, వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడి అవకాశాలిస్తామని బాధితులకు ఆశ చూపించారు. వారికిచ్చిన నకిలీ యాప్‌లో కంపెనీ ప్రొఫైల్స్‌ను రాయడం వంటి పనులు అప్పగించారు. పని పూర్తయిన డ్యాష్‌బోర్డులో 'ఎర్నింగ్' కనిపించేది. కానీ ఆ తర్వాత డబ్బులు రాలేదని బాధితులు గుర్తించారు.
ఈ ఏడాది జనవరి 25 నుంచి ఏప్రిల్ 4 మధ్య రూ. 5,93,240 డిపాజిట్ చేశానని ఓ బాధితుడు చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన హోటల్‌లో ఇన్వెస్ట్ చేయాలని తనకు ట్రంప్ యూట్యూబ్ వీడియో వచ్చిందని, వారు అడిగిన మొత్తం చెల్లించమని చెప్పినట్టు పేర్కొన్నాడు. తనకు ప్రతిరోజూ రూ. 30 అకౌంట్లో వచ్చేదని, రూ. 300 దాటిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత మరింత పెట్టుబడి పెట్టాలని అడిగేవారని, అలా రూ. 5000తో మొదలుపెట్టి రూ. లక్ష వరకు పెట్టానని చెప్పాడు. చివరికి విత్‌డ్రా చేయాలంటే పన్నులు కట్టాలని అడిగినట్టు తెలిపాడు. తమకిచ్చిన యాప్ డ్యాష్‌బోర్డులో చాలా ఎక్కువ సంపాదించినట్టు ఉన్నప్పటికీ, వాస్తవంలో తామే మోసపోయినట్టు గుర్తించామని పేర్కొన్నాడు. ఈ స్కామ్‌కు సంబంధించి హవేరి సైబర్ క్రైమ్ ఎకనామిక్స్ అండ్ నార్కోటిక్స్ పోలీసులు బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






