Stock Market: లాభాల్లో భారత ఈక్విటీలు.. పతనమైన పాక్ మార్కెట్లు

by S Gopi |

సానుకూల సంకేతాలుండటంతో భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితులు మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయాయి.

Stock Market: లాభాల్లో భారత ఈక్విటీలు.. పతనమైన పాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. ఉగ్రవాదాన్ని తొలగించే లక్ష్యంతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలాపై భారత ప్రభుత్వం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్ ' దాడి ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు. బుధవారం ఉదయం ప్రారంభంలో ఉద్రిక్త పరిణామాల కారణంగా కొంతసేపు నష్టాల్లో కదలాడిన సూచీలు ఆ తర్వాత మిడ్-సెషన్ నుంచి పుంజుకున్నాయి. పాక్‌పై దాడికి దిగితే పరిస్థితులు ప్రతికూలంగా మారవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, భారత సైన్యం కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంతో పాక్ ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదని సంకేతాలందాయి. దీనికితోడు మన మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు నిధులను కొనసాగించడం, అమెరికా కరెన్సీ డాలర్ బలహీనపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్లకు కలొసొచ్చాయి. అన్ని రకాలుగా సానుకూల సంకేతాలుండటంతో భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితులు మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ మినహా ఆటో, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 105.71 పాయింట్లు లాభపడి 80,746 వద్ద, నిఫ్టీ 34.80 పాయింట్లు పెరిగి 24,414 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, ఐటీసీ, రిలయన్స్ వంటి షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.74 వద్ద ఉంది.

పాక్ స్టాక్ మార్కెట్ పతనం

పెహల్‌గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ సైనిక దాడి నిర్వహించిన నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్) బుధవారం 6,500 పాయింట్లు కోల్పోయింది. భారీ పతనం కారణంగా స్టాక్ మార్కెట్‌ను తక్షణం తాత్కాలికంగా నిలిపేశారు. పెహల్‌గామ్ దాడికి భారత్ ఖచ్చితంగా బదులిస్తుందనే భయాలతో ఇప్పటికే పీఎస్ఎక్స్ 4 శాతానికి పైగా కుదేలైంది. ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్ కోలుకునే సంకేతాలను చూపించిందని, 112,457.37 పాయింట్లకు చేరుకుందని, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 111,171.92 పాయింట్లకు తగ్గిందని ఏకేడీ సెక్యూరిటీస్‌కు చెందిన ఫాతిమా బుచా చెప్పారు.

Next Story