AI Talent: ఏఐ స్కిల్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీలు

by S Gopi |

దీంతో ఏఐ స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ భారీగా పెరిగింది.

AI Talent: ఏఐ స్కిల్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఇప్పుడు కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తోంది. అనేక టెక్ కంపెనీలు ఏఐ రంగంలో పోటీకి సిద్ధమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ పోటీలో నిలదొక్కుకుని ఆధిపత్యం సాగించేందుకు టెక్ దిగ్గజాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఏఐ స్కిల్స్ ఉన్న ఇంజనీర్లు, ప్రతిభావంతులను కాపాడుకునేందుకు, ఇతర కంపెనీల్లో ఉన్నవారిని దక్కించుకునేందుకు చూస్తున్నాయి. దీంతో ఏఐ స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ భారీగా పెరిగింది. కొంతమంది కోసం టెక్ కంపెనీలు రూ. కోట్లలో వేతనాలిచ్చి మరీ చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రూ. కోట్లలో బోనస్‌

ఇటీవల ఏఐ రంగంలో పోటీ ఒత్తిడి కారణంగా అత్యంత ప్రతిభ కలిగిన 1,000 మంది ఉద్యోగులకు ఓపెన్ఏఐ బోనస్‌లు ప్రకటించింది. వీరు మొత్తం ఉద్యోగుల్లో మూడింట ఒక వంతుకు సమానం. పోటీ కంపెనీలు ఇచ్చే ప్యాకేజీల కంటే ఎక్కువగా ఈ బోనస్‌లు రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు వరకు ఇచ్చినట్టు సమాచారం. ఉద్యోగి పనితీరు, సీనియారిటీ, పాత్ర ఆధారంగా ఆ మొత్తం ఇచ్చింది. తాజాగా కంపెనీ తన ఏఐ మోడల్ జీపీటీ-5 విడుదల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

50 మంది ఉద్యోగులకు మెటా వల

ఇదే తరహాలో మిగిలిన టెక్ కంపెనీలు మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ సైతం కీలకమైన ప్రాజెక్టుల కోసం ఏఐ స్కిల్స్ ఉన్నవారిని అన్వేషిస్తున్నాయి. వేతనాలు, పని విధానం వల్ల ఇతర కంపెనీలకు మారే ఉద్యోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. ఇటీవల గూగుల్ తన డీప్‌మైండ్ ప్రాజెక్టులో ఉన్న రెండు డజన్ల వరకు ఇంజనీర్లు, రీసెర్చర్లు మైక్రోసాఫ్ట్‌కు వెళ్లారు. మరికొందరు మైండ్‌డీప్ మాజీ కో-ఫౌండర్ ముస్తఫా సులేమాన్ టీమ్‌లో చేరారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సైతం ఏఐ టెక్నాలజీపై పనిచేస్తోంది. ఇప్పటికే రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను కూడా మెటా ఏర్పాటు చేసింది. ఈ టెక్‌పై పనిచేసేందుకు ఓపెన్ఏఐ, యాపిల్, డీప్‌మైండ్, ఆంథ్రోపిక్ లంటి కంపెనీలకు చెందిన టెక్ ఉద్యోగులను తీసుకుంది. అంతేకాకుండా ఇటీవల థింకింగ్ మెషిన్స్ కంపెనీని సొంతం చేసుకునే ప్రయత్నంలో మెటా విఫలమైంది. దీంతో అదే కంపెనీలో ఉన్న 50 మంది వరకు ఉద్యోగులకు రూ. కోట్లలో ఆఫర్ చేసి మెటాలో చేర్చుకుంది.

Next Story