OpenAI: స్టార్‌గేట్ ప్రాజెక్టును భారత్‌కు తెచ్చేందుకు చర్చలు జరుపుతున్న ఓపెన్ఏఐ

by S Gopi |

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్‌తో కూడా ఓపెన్ఏఐ ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

OpenAI: స్టార్‌గేట్ ప్రాజెక్టును భారత్‌కు తెచ్చేందుకు చర్చలు జరుపుతున్న ఓపెన్ఏఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన ఓపెన్ఏఐ భారత్‌లో తన జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ స్టార్‌గేట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం దేశీయంగా ఉన్న ప్రముఖ డేటా సెంటర్ల కంపెనీలతో చర్చలు కూడా జరుపుతోంది. ఇందులో యటా డేటా సర్వీసెస్, సిఫీ టెక్నాలజీ, ఈ2ఈ నెట్‌వర్క్స్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్స్ లాంటి కంపెనీలు ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్‌తో కూడా ఓపెన్ఏఐ ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ చర్చల్లో డేటా కంపెనీల ఏర్పాటుతో పాటు ఎనర్జీ వినియోగం, ఇతర సరఫరా వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, రిలయన్స్ సంస్థ ఇప్పటికే జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించే పనిలో ఉంది. గత కొంతకాలంగా భారత ప్రభుత్వం కూడా స్టార్‌గేట్ ప్రాజెక్టును మనదేశానికి తీసుకురావాలని కోరుతోంది. దీనివల్ల మన ప్రజల డేటా స్థానికంగానే ఉంటుందనే లక్ష్యంతో ఆ దిశగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఓపెన్ఐతో చర్చలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి కూడా పెట్టాలని భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు భారత్ అత్యంత కీలంగా మార్కెట్‌గా మారుతుండటం, భవిష్యత్తులో అధిక ఆదాయం ఈ టెక్నాలజీ నుంచే వస్తుందనే అంచనాలున్నాయి. కాబట్టి స్టార్‌గేట్ ప్రాజెక్టులో కొంత వాటా ఉండాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, గత నెలలోనే ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ భారత్ తమకు రెండో అతిపెద్ద్ద మార్కెట్ అని అన్నారు. భవిష్యత్తులో మరింత వేగంగా విస్తరిస్తామని, ఆఫీసును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికోసం కంపెనీ నియామకాలు కూడా ప్రారంభించింది.

స్టార్‌గేట్ గురించి

స్టార్‌గేట్ అనేది ఓపెన్‌ఏఐ ప్రతిష్టాత్మకమైన 500 బిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్. దీనిని గతేడాది జనవరిలో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ తదుపరి తరం ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలు టెక్ భాగస్వామ్యం కూడా ఈ కంపెనీలో ఉంది. ఇది అధునాతన చిప్‌లు, ఎనర్జీ సిస్టమ్స్‌తో పనిచేసే హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కొనసాగుతుంది.

Next Story