- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Online Gaming Act: త్వరలో అందుబాటులోకి రానున్న ఆన్‌లైన్ గేమింగ్ చట్టం
ఇప్పటికే దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ చట్టం అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 21న ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం-2025ని పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ఈ-స్పోర్ట్స్, ఇతర ఆన్‌లైన్ గేమ్‌లను ప్రోత్సహిస్తూనే అన్ని రకాల ఆన్‌లైన్ మనీ గేమ్‌లను నిషేధిస్తుంది. ఇప్పటికే దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అనుకున్న సమయం కంటే చాలా త్వరగా ఈ చట్టం అమలులోకి వస్తుంది. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్ కృష్ణన్ సెమీకండక్టర్లపై జరిగిన ఐసీఈఏ ఈవెంట్ సందర్భంగా అన్నారు. గత వారం ఆర్థిక సేవల శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు జరిపిన సంయుక్త సమావేశంలో బిల్లు నిబంధనను అమలు చేయడానికి వివరణాత్మక మార్గదర్శకాలను, ఆన్‌లైన్ మనీ గేమ్‌ల కోసం లావాదేవీలను సమీక్ష నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సమయాన్ని కోరాయి. ఈ చట్టం ఆన్‌లైన్ మనీ గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలను, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అటువంటి గేమ్‌లలో నిధులను బదిలీ చేయకుండా నిషేధిస్తుంది. అందుకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆర్థిక పరమైన లావాదేవీల తనిఖీలకు సమయం కోరాయి. ఆన్‌లైన్ మనీ గేమ్స్ గురించి యాడ్స్ వేస్తే 2 ఏళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ మనీ గేమ్స్‌కు ఆర్థిక సహకారం అందించే వారికి 3 ఏళ్ల జైలుశిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు. పదే పదే చట్టాన్ని ఉల్లంఘిస్తే 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 కోట్ల జరిమానా విధించనున్నారు.






