Ola Foods: ఫుడ్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపేసిన ఓలా

by S Gopi |

యాప్ పాత వెర్షన్‌లో సైతం ఓఎన్‌డీసీ ద్వారా పనిచేసే క్లౌడ్ కిచెన్ వ్యాపార ఆర్డర్లను కూడా తీసుకోవడంలేదు.

Ola Foods: ఫుడ్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపేసిన ఓలా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్యాబ్ సేవల ప్లాట్‌ఫామ్ ఓలా కన్స్యూమర్ తన ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలుస్తోంది. యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత ఓలా ఫుడ్స్ సేవలు ఇకపై అందుబాటులో లేవని కనిపిస్తున్నట్టు మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది. యాప్ పాత వెర్షన్‌లో సైతం ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ) ద్వారా పనిచేసే క్లౌడ్ కిచెన్ వ్యాపార ఆర్డర్లను కూడా తీసుకోవడంలేదు. అయితే, రైడ్-హెయిలింగ్ యాప్ ఓలా ఫుడ్స్‌ను పునఃప్రారంభిస్తుందా లేదా వ్యాపారాన్ని పూర్తిగా వదిలివేస్తుందా అనేది స్పష్టంగా తెలియదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఓలా క్యాబ్ సేవలు, ఈ-స్కూటర్ల తయారీ మినహా వివిధ వ్యాపారాలను ప్రారంభించి, తర్వాత మూసేసింది. ముఖ్యంగా యూజ్‌డ్ కార్ల విభాగం ఓలా కార్స్, ఓలా డ్యాష్, క్విక్ కామర్స్ విభాగంలోనూ పలీట్ ప్రాజెక్టుల రూపంలో కొంతకాలం నిర్వహించింది.

ఫుడ్ డెలివరీలో ఓలాకు సవాళ్లు

ఫుడ్ డెలివరీ విభాగంలో ఓలా చేసిన మొదటి ప్రయత్నం ఇది మాత్రమే కాదు. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ సంస్థ మొదట 2015లో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 2019లో, ఇది ఓలా ఫుడ్స్‌ను క్లౌడ్-కిచెన్‌గా ఇన్-హౌస్ బ్రాండ్‌లతో, ఓలా లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీలు చేసింది. ఆ తర్వాత 2023లోనూ కంపెనీ ప్రభుత్వ ఓఎన్‌డీసీలో చేరి తన క్యాబ్ సేవల యాప్‌ ద్వారానే ఫుడ్ డెలివరీ సేవలను అందించింది. 2024 డిసెంబర్ నాటికి 100 నగరాలకు ఫుడ్ డెలివరీ సేవలను విస్తరించింది. అయితే, పరిమిత ఆర్డర్‌ల కారణంగా ఓలా ఈ సేవలను నిలిపివేసింది.

Next Story