- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Oil Prices: ట్రంప్ ప్రకటనతో 13 శాతం పడిన చమురు ధరలు
ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర సోమవారం సాయంత్రం తర్వాత దాదాపు 14 శాతం క్షీణించి 97 డాలర్లకు చేరుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా రికార్డు స్థాయికి పెరిగిన ముడి చమురు ధరలు సోమవారం సాయంత్రం గణనీయంగా తగ్గాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మద్దతునిచ్చింది. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల వరకు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖను ఆదేశాలిచ్చానని ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర సోమవారం సాయంత్రం తర్వాత దాదాపు 14 శాతం క్షీణించి 97 డాలర్లకు చేరుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 12 శాతం తగ్గి 86 డాలర్లుగా ఉంది. మొత్తంగా అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు సగటున 13 శాతం క్షీణించాయని గ్లోబల్ మీడియా తెలిపింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ఆపేయడంపై రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల వరకు వాయిదా వేయాలని తమ బలగాలను నిర్దేశించినట్టు తెలిపారు. ఇరాన్‌తో చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్ నిర్ణయాలు, కార్యాచరణ ఉంటుందన్నారు
చమురు సరఫరా అవసరం: ట్రంప్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని అందించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వారమంతా ఇరాన్‌తో నిర్మాణాత్మక సంప్రదింపులు కొనసాగుతాయి. అందుకే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేశాం. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, సమావేశాలు విజయవంతం కావాలనే ఉద్దేశంతోనే దాడులను ఆపివేశాం. వ్యవస్థలో వీలైనంత ఎక్కువ చమురు ఉండాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. సరుకులతో నిండిన నౌకలు వెనక్కి తగ్గకుండా సరఫరాను అందించాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
యుద్ధం ఆగకపోతే
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి దాడులు ప్రారంభించాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఓ దశలో 125 డాలర్ల వరకు వెళ్లింది. గత మూడు వారాల పరిస్థితులను గమనిస్తే, ముడి చమురు ధరలు 56 శాతం పెరిగాయి. ఖతార్‌పై ఇరాన్ దాడులతో సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడింది. మనదేశంలో కమర్షియల్ ఎల్‌పీజీ లభించక హాస్టళ్లు, రెస్టారెంట్లు మొదలుకొని చిన్న చిన్న హోటళ్ల వ్యాపారులు భారీగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే ఇతర రంగాలకు దీని ప్రభావం పడుతోంది. ఈ సమయంలో ట్రంప్ ప్రకటన భారీ ఊఅరట కలిగింది. అందుకే ముడి చమురు ధరలు ఒక్కరోజులోనే 13 శాతం దిగొచ్చాయి.






