OMCs: ఓఎంసీలకు రూ. లక్ష కోట్ల ఊరట?

by S Gopi |

అండర్-రికవరీలను పూడ్చేందుకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు దాదాపు రూ. లక్ష కోట్ల నష్టపరిహార ప్రతిపాదనను పంపింది.

OMCs: ఓఎంసీలకు రూ. లక్ష కోట్ల ఊరట?
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు (ఓఎంసీ) భారీ ఆర్థిక సహాయం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సంస్థలు ఎదుర్కొంటున్న అండర్-రికవరీలను పూడ్చేందుకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు దాదాపు రూ. లక్ష కోట్ల నష్టపరిహార ప్రతిపాదనను పంపింది. ఇందులో గృహ వినియోగ ఎల్పీజీని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు విక్రయించడం వల్ల వచ్చిన నష్టాలకు మాత్రమే సుమారు రూ.50,000-55,000 కోట్ల పరిహారం కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చమురు, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతుండగా, సానుకూల నిర్ణయం వచ్చే అవకాశాలపై చమురు శాఖ ఆశాభావంతో ఉంది. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.3, డీజిల్‌పై రూ.27, గృహ ఎల్పీజీ సిలిండర్‌పై దాదాపు రూ.700 వరకు అండర్-రికవరీని భరిస్తున్నట్లు అంచనా. అయితే అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి ఎల్పీజీ ధరలు వచ్చే నెల నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉండటంతో, గృహ ఎల్పీజీపై నష్టం సిలిండర్‌కు రూ.200-250 వరకు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు తక్షణ సహాయం అవసరమని ఓఎంసీలు కేంద్రానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. అందుకే పరిహారం అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోంది.

Next Story