HDFC Bank: ఛైర్మన్ రాజీనామాతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లపై ఒత్తిడి

by S Gopi |

అతాను చక్రవర్తి స్పష్టమైన కారణాలను పేర్కొనకపోవడంతో బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు.

HDFC Bank: ఛైర్మన్ రాజీనామాతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లపై ఒత్తిడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశం అయింది. ఆయన రాజీనామా లేఖలో.. గత కొన్నేళ్లుగా బ్యాంకులో కొన్ని వ్యవహారాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. ఆయన రాజీనామా స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. దీంతో గురువారం బ్యాంకు షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఓ దశలో 9 శాతానికి పైగా క్షీణించడంతో బ్యాంక్ నిఫ్టీ సైతం ప్రభావితమై 3 శాతం పడిపోయింది. అయితే, అతాను చక్రవర్తి స్పష్టమైన కారణాలను పేర్కొనకపోవడంతో బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్ల వరకు తుడిచిపెట్టుకుపోయింది. అతాను చక్రవర్తి అనూహ్య రాజీనామాతో బ్యాంకు పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా కేకీ మిస్త్రీని నియమించింది. అతాను చక్రవర్తి రాజీనామా వెనుక బ్యాంకులో అంతర్గతంగా ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేవు. అభిప్రాయ బేధాలు సహజమని, అవి సాధారణమేనని మిస్త్రీ చెప్పారు.

ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తక్షణం స్పందించింది. కేకి మిస్త్రీని మూడు నెలల పాటు తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించే ప్రణాళికకు బ్యాంకు ఆమోదం తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి, కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. బ్యాంక్‌ వద్ద తగినంత మూలధనం, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బలమైన పునాదులు కలిగిన పటిష్టమైన సంస్థ అని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Next Story