Starbucks: నో కాఫీ.. నో వాష్ రూమ్.. స్టార్‌బక్స్ కొత్త పాలసీ

by S Gopi |

ఈ నిర్ణయం జనవరి ఆఖరు నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేసింది.

Starbucks: నో కాఫీ.. నో వాష్ రూమ్.. స్టార్‌బక్స్ కొత్త పాలసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్టార్‌బక్స్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి సంబంధించి కొత్త పాలసీని ప్రకటిస్తూ..ఇకపై కస్టమర్లు తమ కేఫ్‌లలో ఉండటం, వాష్‌రూమ్‌లను వాడుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జనవరి ఆఖరు నుంచి అమల్లోకి వస్తుందని, ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేసింది. కొత్త విధానం ప్రకారం.. స్టార్‌బక్స్ స్టోర్‌లలో ఉండేందుకు, సౌకర్యాలను ఉపయోగించేందుకు తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు చేయాలి. అంతేకాకుందా కస్టమర్లు స్టోర్‌కు వచ్చిన తర్వాత ఏమైనా డ్రింక్ తీసుకుంటారా లేదా అని అడిగే హక్కు కూడా సిబ్బందికి ఉంటుంది. కొంతసేపు ఉండాలనుకునే వారికి అపరిమితంగా కోల్డ్ లేదా హాట్ కాఫీ అందించనున్నారు. ఎవరైనా కస్టమర్లు ఈ నిబంధనలను నిరాకరిస్తే వారిని బయటికి పంపే హక్కు నిర్వాహకులకు ఉంటుందని, అవసరమైతే ఉద్యోగులు చట్టపరంగా కూడా చర్యలకు ముందుకెళ్లవచ్చని కంపెనీ వివరించింది. కొత్త పాలసీ జనవరి 27 నుంచి వర్తిస్తుందని, దీనిపై సిబ్బంది, స్టోర్ల యజమానులకు శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు కంపెనీ వివరించింది. 2018లో స్టార్‌బాక్స్ ఓపెన్ యాక్సెస్ పేరుతో స్టార్‌బక్స్ స్టోర్‌లో ఎంతసేపైనా ఉండేందుకు, ఉచితంగా వాష్‌రూమ్‌ను వాడేందుకు ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అయితే, ఇటీవల పడిపోతున్న అమ్మకాలు, స్టాక్ ధరలు, పెట్టుబడిదారుల నుంచి ఒత్తిళ్ల కారణంగా కంపెనీ ఈ పాలసీని రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొచ్చింది.

Next Story