Nirmala Sitaraman: వరుసగా 9వ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ రికార్డు

by S Gopi |   (  Updated:2026-01-27 14:17:39  IST  )

దీంతో, వివిధ కాల వ్యవధులలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన 10 బడ్జెట్ల రికార్డుకు సీతారామన్ మరింత చేరువ అయ్యారు.

Nirmala Sitaraman: వరుసగా 9వ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ రికార్డు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు. ఫిబ్రవరి 1న వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఆమె ఈ ఘనతను దక్కించుకుంటారు. గందరగోళంగా మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసే లక్ష్యంతో సంస్కరణ చర్యలు ఈ బడ్జెట్‌లో ఉంటాయని భావిస్తున్నారు. దీంతో, వివిధ కాల వ్యవధులలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన 10 బడ్జెట్ల రికార్డుకు సీతారామన్ మరింత చేరువ అయ్యారు. మోరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మొత్తం 6 బడ్జెట్లను, 1967-1969 మధ్య 4 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వేర్వేరు ప్రధాన మంత్రుల హయాంలో వరుసగా తొమ్మిది, ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో వరుసగా తొమ్మిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకుంటారు.

2019లో ప్రధానమంత్రి మోడీ రెండోసారి విజయం సాధించినప్పుడు, నిర్మలా సీతారామన్ దేశ మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 2024లో మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామన్ తన ఆర్థిక శాఖను కొనసాగించారు. ఇప్పటివరకు, ఆమె 2024, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో సహా మొత్తం ఎనిమిది వరుస బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

స్వాతంత్ర్యం తర్వాత మనదేశ బడ్జెట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

మొదటి బడ్జెట్: స్వతంత్ర భారత మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న దేశపు మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు.

అత్యధిక బడ్జెట్లు: అత్యధిక సంఖ్యలో బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఉంది. ఆయన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఆ తర్వాత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మొత్తం 10 బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

రెండవ అత్యధిక బడ్జెట్లు: మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఆయన మొదటిసారిగా మార్చి 19, 1996న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు తిరిగి ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు.

మూడవ అత్యధిక బడ్జెట్లు: ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా తన పదవీకాలంలో ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఆయన 1982, 1983, 1984లో బడ్జెట్లను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో 2009, ఫిబ్రవరి, 2012 నుంచి మార్చి 2012 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

మన్మోహన్ సింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1991-1995 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం: ఫిబ్రవరి 1, 2020న నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం రెండు గంటల 40 నిమిషాల పాటు సాగి, అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా రికార్డు సృష్టించింది. ఆ సమయంలో, ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగం: 1977లో హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతో ఇప్పటివరకు అత్యంత చిన్నదిగా ఉంది.

సమయం: సాంప్రదాయకంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఈ సమయం వలసవాద కాలం నాటి పద్ధతిని అనుసరించేది, దీనివల్ల ప్రకటనలు లండన్‌తో పాటు భారత్‌లోనూ ఒకే సమయం ఉండేలా చేసేవారు. 1999లో ఈ సమయాన్ని మార్చారు, అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి, బడ్జెట్లను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతున్నారు.

తేదీ మార్పు: బడ్జెట్ సమర్పించే తేదీనీ 2017లో మార్చారు. పార్లమెంటరీ ఆమోద ప్రక్రియను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయడానికి, ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే బడ్జెట్‌ను అమలు చేయడానికి వీలుగా, ఈ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు.

READ MORE ....

Finance Ministry: హల్వా వేడుకలో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలమ్మ

Next Story