తక్కువ లాభాలకు పరిమితమైన సూచీలు!

by Disha Web Desk 17 |
తక్కువ లాభాలకు పరిమితమైన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం స్వల్ప లాభాలతో ముగిశాయి. అయితే, ఆసియా, యూరప్, అమెరికాలో పేలవమైన ఆర్థిక గణాంకాల కారణంగా ప్రపంచ మాంద్యం భయాలతో ఈ వారం బలహీనంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమయంలో మెరుగైన లాభాలతో ర్యాలీ చేసిన సూచీలు మిడ్-సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా నెమ్మదించాయి. ఓ దశలో నష్టాల్లో ట్రేడయిన తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో తక్కువ లాభాలకు పరిమితమయ్యాయి.

ప్రధానంగా దేశీయ దిగ్గజ సంస్థల షేర్లలో అమ్మకాలు పోటెత్తడమే స్టాక్ మార్కెట్ల ఊగిసలాటకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు లేనప్పటికీ, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

అదానీ గ్రూప్ కంపెనీ మీడియా సంస్థ ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎన్‌డీటీవీ షేర్లు వరుసగా మూడో రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్లలో రోజంతా ఊగిసలాట ధోరణిలో ర్యాలీ చేసిన తర్వాత చివర్లో గరిష్ఠాల వద్ద అమ్మకాల కారణంగా లాభాలు తగ్గాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59.15 పాయింట్లు పెరిగి 58,883 వద్ద, నిఫ్టీ 36.45 పాయింట్లు లాభపడి 17,558 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించగా, మెటల్ రంగం పుంజుకుంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, టైటాన్, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎంఅండ్ఎం షేర్లు అధిక లాభాలను సాధించాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.81 వద్ద ఉంది.


Next Story

Most Viewed