RBI: 2026 నుంచి డిజిటల్ చెల్లింపుల్లో కొత్త నిబంధనలు

by S Gopi |

డిజిటల్‌ లావాదేవీల్లో ఎస్సెమ్మెస్‌ ఆధారిత ఓటీపీతో పాటు అదనంగా అథెంటికేషన్‌ ప్రక్రియ ఉంటుంది.

RBI: 2026 నుంచి డిజిటల్ చెల్లింపుల్లో కొత్త నిబంధనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త నియమాలు తీసుకురానుంది. డిజిటల్‌ లావాదేవీల్లో ఎస్సెమ్మెస్‌ ఆధారిత ఓటీపీతో పాటు అదనంగా అథెంటికేషన్‌ ప్రక్రియ ఉంటుంది. ఇవి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. ఈ నిబంధనల్లో భాగంగా ఎస్సెమ్మెస్ ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్‌కు మించి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ)ని అమలు చేసేందుకు అవసరమైన మార్గాలను అనుమతించనున్నారు. ప్రస్తుతం ఓటీపీ వ్యవస్థ సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ.. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ప్రత్యామ్నాయ అథెంటికేషన్‌ వ్యవస్థ ఉండాలని ఆర్‌బీఐ భావించింది. ఇదే సమయంలో అదనపు అథెంటికేషన్‌ ప్రక్రియను యాక్టివేట్‌ చేయడానికి తప్పనిసరిగా కస్టమర్‌ అనుమతి తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కార్డుతో చేసే లావాదేవీలు మినహాయించి ఇతర డిజిటల్‌ చెల్లింపులన్నీ అథెంటికేషన్‌ను ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది.. ఆర్‌బీఐ వివరాల ప్రకారం.. ఏదైనా నిర్దిష్ట మినహాయింపు ఉన్న వాటికి కాకుండా, అన్ని దేశీయ డిజిటల్ చెల్లింపులకు కనీసం రెండు వేర్వేరు అథెంటికేషన్ అవసరం ఉంటుంది. అందులో ఒకటి డైనమిక్‌గా ఉండాలి, అంటే, లావాదేవీ సమయంలో ఎంటర్ చేసే ఫ్యాక్టర్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని మళ్లీ ఉపయోగించకూడదు. ఒకే ఫ్యాక్టర్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగించే విధానాన్ని అనుమతి ఉండదు.

Next Story