FASTag: ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఫాస్టాగ్ నిబంధనలు

by S Gopi |

ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

FASTag: ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఫాస్టాగ్ నిబంధనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి కార్లు, జీపులు, వ్యాన్లు సహా అన్ని వాహనాలకు నో యువర్ వెహికల్ (కేవైవీ) ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫాస్టాగ్ కస్టమర్ల సౌకర్యాన్ని మెరుగుపరచడం, హైవేలో వారు ఎదుర్కొంటున్న యాక్టివేషన్ ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కేవైవీ ప్రక్రియ వల్ల ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం ఎక్కువ సమయం వృధా అవుతోందని, అందుకే ఈ నిబంధనను తెచ్చినట్టు ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్‌లకు సైతం కేవైవీ అవసరంలేదని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం, ఫాస్టాగ్ కనిపించే విధంగా లేకపోవడం, పొరపాట్లు ఉండటం, దుర్వినియోగం కావడం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ తప్పనిసరి. సాధారణ కస్టమర్లకు ఇక దీని అవసరం ఉండదు. అలగే, వాహన్ డేటాబేస్ నుంచి వాహన వివరాలను ధృవీకరించి ఫాస్టాగ్ ఇచ్చే సమయంలో బ్యాంకులు యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాయి. ఒకవేళ డేటాబేస్‌లో వివరాలు లభించకపోతే, ఆర్‌సీని ఆధారంగా వెరిఫికేషన్ చేస్తాయి. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఫాస్టాగ్‌లకూ ఇదే విధానం వర్తిస్తుంది. ఇప్పటివరకు వాహనానికి సంబంధించి ముందు, సైడ్‌వ్యూ ఫోటోలతో పాటు ఆర్‌సీ, విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ స్టిక్కర్ ఫోటోలో అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగనున్నాయి.

Next Story