సీనియర్ ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని స్పష్టం చేసిన Flipkart !

by Disha Web Desk 13 |
సీనియర్ ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని స్పష్టం చేసిన Flipkart !
X

బెంగళూరు: ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల మధ్య టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తున్న వేళ, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగుల్లో 70 శాతం మందికి మాత్రమే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. దీని ద్వారా సుమారు 5,000 మంది సీనియర్ ఉద్యోగులకు వేతనాల్లో ఎలాంటి పెంపు ఉండదని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా వివరాలను తెలియజేసినట్టు సమాచారం.

దాని ప్రకారం, గ్రేడ్ 10, ఆపై స్థాయి ఉద్యోగుల జీతాల్లో పెంపు ఉండదని వెల్లడించింది. ఇదే సమయంలో జీతాలు పెంపు లేనప్పటికీ బోనస్‌లు, స్టాక్ ఆప్షన్ వంటి కేటాయింపులను కొనసాగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ వార్షిక అంచనాలు పూర్తయిన నేపథ్యంలో ఇంక్రిమెంట్లు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్ణయం ద్వారా ఆర్థిక కష్టాలను అధిగమించాలని భావిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికే ఇంక్రిమెంట్ ఇవ్వాలనే నిర్ణయానికొచ్చినట్టు వివరించింది. ఇప్పటికే ఉద్యోగుల పనితీరుకు సంబంధించి సమీక్ష ముగిసినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.



Next Story