Nasscom: సైబర్ దాడులపై ఐటీ కంపెనీలకు నాస్కామ్ వార్నింగ్

by S Gopi |

ప్రధానంగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పెరిగిన తర్వాత నాస్కామ్ ఈ వార్నింగ్ ఇచ్చింది.

Nasscom: సైబర్ దాడులపై ఐటీ కంపెనీలకు నాస్కామ్ వార్నింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని భారత ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ, వ్యాపార ప్రణాళికలను బలోపేతం చేయాలని సూచించింది. ప్రధానంగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పెరిగిన తర్వాత నాస్కామ్ ఈ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని, పరిస్థితి మరింత దిగజారితే కంపెనీలు అంతరాయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. సంస్థలు బ్యాకప్ ప్లాన్‌లను సమీక్షిస్తూ, సిస్టమ్ సెక్యూరిటీ మెరుగుపరచాలని, అత్యవసర సమయాల్లో కూడా కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని వివరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తరచుగా సైబర్ దాడులు, తప్పుడు సమాచార వ్యాప్తి, డిజిటల్ అంతరాయానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించుకోవాలని నాస్కామ్ పేర్కొంది. దీనికోసం కంపెనీలు సాఫ్‌వేర్ అప్‌గ్రేడ్, సరఫరా వ్యవస్థల తనిఖీ, మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు సంబంధించి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాలని, ప్రభావం ప్రాంతం గుండా అనవసరమైన ప్రయాణాన్ని నివారించడం ద్వారా ఉద్యోగులను రక్షించాలని కూడా కంపెనీలను నాస్కామ్ కోరింది.

Next Story