- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RIL: రిలయన్స్ 'ఏఐ వార్ ' మొదలు
దీనివల్ల 6 లక్షలకు పైగా ఉన్న సంస్థ ఉద్యోగుల ఉత్పాదకతను 10 రెట్లు మెరుగుపడుతుందని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: మానవ చరిత్రలోనే ఏఐ అత్యంత కీలకమైన సాంకేతిక అభివృద్ధి అని ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. భవిష్యత్తులో రిలయన్స్ సంస్థను ఏఐ-నేటివ్ డీప్-టెక్ సంస్థగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీని లక్ష్యం, కంపెనీ పూర్తిస్థాయిలో కృత్రిమ మేధస్సు(ఏఐ) కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ మేరకు మంగళవారం రిలయన్స్ సంస్థ నుంచి ఏఐ మేనిఫెస్టోను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఈ మేనిఫెస్టో రిలయన్స్ సంస్థలోని 6 లక్షలకు పైగా ఉద్యోగుల ఉత్పాదకతను 10 రెట్లు మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని, దేశ ఆర్థికవ్యవస్థ, సమాజంపై 10 రెట్లు సానుకూల ప్రభావాన్ని సృష్టించగలదని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి భారతీయుడికి తక్కువ ఖర్చుతో ఏఐని అందించే నినాదంతో పాటు, ఏఐని సురక్షితంగా, విశ్వసించే, బాధ్యతాయుతమైన టెక్నాలజీగా అందించడమే రిలయన్స్ ప్రధాన సంకల్పమని ముఖేష్ అంబానీ వెల్లడించారు.
దేశంలో డిజిటల్ విప్లవాన్ని సృష్టించిన తరహాలోనే భారత ఏఐని ముందుండి నడిపిస్తామని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ మేనిఫెస్టో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మాత్రమే కాదు, రిలయన్స్ సంస్థలో పనిచేసే విధానాన్ని మార్చడం గురించి అని ఆయన వివరించారు. రిలయన్స్ సంస్థ ఏఐ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. రెండు దశల్లో ఏఐని అభివృద్ధి చేస్తామని అంబానీ చెప్పారు. మొదటి దశలో విసుగనిపించే, పునరావృతమయ్యే పనిని తొలగించడానికి, ఉద్యోగులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి, వేగంగా, చురుగ్గా పనిచేయడానికి ఏఐని ఉపయోగిస్తాం. అయితే, ఏఐ వినియోగం ఎంత విస్తృత్వమంగా ఉన్నప్పటికీ, అంతిమ నిర్ణయాలకు సంబంధించి మనుషులే బాధ్యత వహిస్తారు. ఏఐ ఉద్యోగులకు పనిలో సహకారం అందిస్తుందని, వారిని భర్తీ చేయదని అంబానీ పేర్కొన్నారు.
ఈ దశలో ప్రధానంగా సంస్థ అంతర్గతంగా ఉద్యోగుల పనితీరులో కీలకమైన మార్పులు చేయడమన్నారు. తయారీతో పాటు సరఫరా, అమ్మకాలు, నియామకాల్లో మానవ శ్రమను తగ్గించి, వేగంగా నిర్ణయాలు తీసుకునే పనిని ఏఐ ఏజెంట్లు చూసుకుంటాయి. డేటాపై ఆధారపడి ఏఐ పనులను వేగంగా నిర్వహిస్తుంది, మనుషుల జవాబుదారీతనాన్ని తగ్గిస్తుంది.
రెండో దశలో, భారత ఏఐ వృద్ధిలో రిలయన్స్ సంస్థ కీలకంగా మారుతుంది. ఉదాహరణకు రిలయన్స్ జియోకు చెందిన 50 కోట్ల సబ్‌స్క్రైబర్ల ద్వారా దేశంలో ఏఐ అభివృద్ధిని అత్యంత వేగంగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు అంబానీ వివరించారు. సంస్థకు చెందిన ఇతర వ్యాపారాలు రిటైల్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ లాంటి వాటిలో ఏఐను అనుసంధానం చేస్తామని, గ్రీన్ ఎనర్జీ, రోబోటిక్స్ వంటి రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఏఐ వినియోగాన్ని పెంచుతామని అన్నారు. భవిష్యత్తులో రిలయన్స్ ఫౌండేషన్ నుంచి విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి మార్పు కోసం ప్రత్యేక వ్యవస్థలను తీసుకొస్తామని అంబానీ వెల్లడించారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యాపారాల్లో ఏఐ వినియోగానికి సంబంధించి ఉద్యోగుల నుంచి సూచనలు ఇవ్వాలని ముఖేష్ అంబానీ కోరారు. 2026, జనవరి 10-26 తేదీల మధ్య తమ ఐడియాలను పంచుకోవాలని, ఈ మేనిఫెస్టో కొత్త రిలయన్స్, కొత్త భారత నిర్మాణానికి నాంది అని అన్నారు.






