Reliance: మొట్టమొదటిసారిగా టైమ్100 దాతృత్వ జాబితాలో ముఖేష్, నీతా అంబానీలు

by S Gopi |

నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Reliance: మొట్టమొదటిసారిగా టైమ్100 దాతృత్వ జాబితాలో ముఖేష్, నీతా అంబానీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, బిలియనీర్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ మొట్టమొదటిసారి టైమ్100 దాతృత్వ జాబితా-2025లో చోటు దక్కించుకున్నారు. 2024లో భారీగా సామాజిక కార్యక్రమాల ద్వారా వారిద్దరూ రూ. 407 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ కారణంగానే వారు దేశంలోనే అగ్రశ్రేణి దాతల జాబితాలో చేరారు. టైమ్100 జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీ దేశంలోని వివిధ రంగాల పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాలలో లక్షలాది మంది జీవితాలను మార్చారు. స్కాలర్‌షిప్‌లకు నిధులు సమకూర్చడం, పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం నుంచి స్థిరమైన వ్యవసాయం, నీటి సంరక్షణ, ఆసుపత్రుల నిర్మాణాల వరకు, రిలయన్స్ సంస్థ దాతృత్వంలో తన పరిధిని పెంచుకుంటోంది. ముఖేష్, నీతా అంబానీల దాతృత్వ కార్యక్రమాలు వారి వ్యాపార సామ్రాజ్యం తరహాలోనే వైవిధ్యంగా, విస్తృతంగా కొనసాగుతోందని టైమ్100 తెలిపింది. వీరి తర్వాత అజీమ్ ప్రేమ్‌జీ, జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ జాబితాలో స్థానం సంపాదించారు.

Next Story