GST Reforms: ఇప్పటికీ పూర్తిస్థాయిలో సామాన్యులకు దక్కని జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలు

by S Gopi |

ప్యాకేజ్‌డ్ ఫుడ్, ఔషధాల విభాగాల్లోని వస్తువులు ఇప్పటికీ 10 మంది కస్టమర్లలో ఒకరికి మాత్రమే ప్రయోజనం లభించింది.

GST Reforms: ఇప్పటికీ పూర్తిస్థాయిలో సామాన్యులకు దక్కని జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0కు సంబంధించి పన్ను తగ్గింపు ప్రయోజనాలు ఇప్పటికీ చాలామందికి అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు కస్టమర్లకు బదిలీ చేసినప్పటికీ, ప్యాకేజ్‌డ్ ఫుడ్, ఔషధాల వంటి కొన్ని విభాగాల్లో ఇప్పటికీ తగ్గింపు రేట్లను అమలు చేయలేదని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ తెలిపింది. దీనికి ప్రధానంగా చాలా బ్రాండ్లు లేదా తయారీ కంపెనీలు నష్టాలను భరించేందుకు సిద్ధంగా లేకపోవడం, ఫలితంగా రిటైలర్లు సైతం తక్కువ ధరలకు విక్రయాన్ని ఇష్టపడకపోవడం కారణమని లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది. ప్యాకేజ్‌డ్ ఫుడ్, ఔషధాల విభాగాల్లోని వస్తువులు ఇప్పటికీ 10 మంది కస్టమర్లలో ఒకరికి మాత్రమే జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనం లభించింది. అలాగే, 10 మందిలో ఇద్దరు మాత్రమే తాము కొంతవరకు జీఎస్టీ తగ్గిన ప్రయోజనాలు పొందినట్టు చెప్పారు. దీన్ని బట్టి దాదాపు 70 శాతం మంది వినియోగదారులు జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు పొందలేదు. ఈ నెల మొదటివారంలో చేసిన సర్వేలో ప్యాకేజ్‌డ్ ఫుడ్ విభాగంలో 40 శాతం మంది కస్టమర్లు తగ్గిన పన్ను రేట్ల ప్రయోజనాలను పొందినట్టు చెప్పారు. మరో 18 శాతం మంది పాక్షికంగా ప్రయోజనాలు పొందినట్టు తెలిపారు.

గృహోపకరణాలు, వైట్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ విషయంలో ప్రతి 10 మంది కస్టమర్లలో ముగ్గురు మాత్రమే జీఎస్టీ రేటు తగ్గింపు పూర్తి ప్రయోజనాలు అందుకున్నారు. మరో ముగ్గురు పాక్షికంగా ప్రయోజనాలు పొందామన్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ విభాగంలో పన్ను తగ్గింపు ప్రయోజనాలు దాదాపు పూర్తిస్థాయిలో అందాయి. జీఎస్టీ రేట్లను అమలు చేసిన మొదటి వారంలోనే వాహనం కొన్న 70 శాతం మంది పూర్తి ప్రయోజనాలు పొందినట్టు సమాచారం. గత నెల 22న కేంద్రం తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో దాదాపు 80 శాతం వస్తువులు, సేవలపై జీఎస్టీ తగ్గింది. అనేక మందులు, ప్యాకేజ్‌డ్ ఫుడ్‌పై జీఎస్టీ గతంలో ఉన్న 18 శాతం లేదా 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే.

Next Story