- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India Post: డిజిటల్‌గా మారుతున్న పోస్టాఫీస్ సేవలు
దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలను సులభంగా, మరింత వేగంగా అందించనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పోస్టాఫీసులన్నీ ఇక డిజిటల్ కానున్నాయి. ప్రైవేట్ రంగానికి ధీటుగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు, సులభంగా అన్ని సేవలు అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ 2.0 సాంకేతికతను అందిపుచ్చుకుని ఇండియా పోస్ట్ డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది. ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించనుంది. పోస్టల్ విభాగంలో ఐటీ నూతన మౌలిక సదుపాయాల ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సీఈపీటీ) సహకారంతో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ(ఏపీటీ)ని ఆగష్టు 1న ప్రారంభించనుంది. ఐటీ 2.0 ఫ్రేమ్‌వర్క్ కింద ఇండియా పోస్ట్ ఇకపై రియల్-టైమ్ ట్రాక్ అండ్ ట్రేస్ సామర్థ్యాలు, బల్క్ కస్టమర్ల కోసం సేవలు, ఎలక్ట్రానిక్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, ఓటీపీ- ఆధారిత ప్రామాణీకరణ, డిజిటల్ చెల్లింపులు, ఓపెన్ ఏపీఐ ఇంటిగ్రేషన్‌ను రూపొందించింది. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలను సులభంగా, మరింత వేగంగా అందించనుంది. అంతేకాకుండా ఇప్పటివరకు హెడ్ పోస్టాఫీసుల్లోనే అమలులో ఉన్న యూపీఐ చెల్లింపులు ఇకపై అన్నిచోట్లా అమల్లోకి వస్తాయి. పోస్టల్ సేవింగ్ బ్యాంక్ సేవలు మినహాయించి మిగిలిన అన్ని రకాల చెల్లింపులు యూపీఐ ద్వారా చేసే వీలుంటుంది.
దేశవ్యాప్తంగా 86,000కి పైగా పోస్టాఫీసులు డిజిటల్‌గా మారాయి. ఆగస్టు 4 నాటికి దాదాపు 1,65,000 పోస్టాఫీసుల మొత్తం నెట్‌వర్క్ కొత్త ప్లాట్‌ఫామ్‌లోకి మారుతుందని తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఇండియా పోస్ట్ తెలిపింది. ఇండియా పోస్ట్‌ను సాంకేతికత ఆధారిత, పౌర-కేంద్రీకృత లాజిస్టిక్స్, ఈ-కామర్స్ ఎనేబుల్‌గా మార్చడానికి కేంద్రం ప్రారంభించిన సంస్కరణల చొరవలో భాగంగా కొత్త ప్లాట్‌ఫామ్‌లోకి మార్చినట్టు పేర్కొంది.
డిజిటల్‌గా మారనున్న సేవలు
* రియల్-టైమ్ ట్రాక్ అండ్ ట్రేస్: కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్‌లు తమ పార్శిల్‌లు, మెయిల్‌లను రియల్-టైమ్‌లో ట్రాక్ చేయడానికి వీలవుతుంది. దీనివల్ల అధిక పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది.
* కస్టమైజ్‌డ్ సేవలు: బల్క్ కస్టమర్‌లకు వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా సేవలను అందించనున్నారు. ఇందులో బల్క్ రూపంలో జరిగే పార్శిళ్లను కస్టమర్‌కు కావాల్సిన సమయంలో డెలివరీ చేయడం, త్వరితగతిన చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం,ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ సేవలు లభిస్తాయి.
* ఎలక్ట్రానిక్ డెలివరీ ప్రూఫ్: ఈ ఫీచర్ కస్టమర్‌లకు డెలివరీలకు సంబంధించి డిజిటల్ వివరాలను తెలుసుకోవచ్చు. దీనివల్ల పోస్టాఫీస్ సర్వీసుల్లో ఉన్న సమస్యలను తగ్గిస్తుంది.
* క్యూఆర్ కోడ్ : వినియోగదారులు తమ ఉత్తరాలు, స్పీడ్ పోస్టు కోసం ఇకపై నేరుగా డబ్బులు చెల్లించే అవసరం ఉండదు. పోస్టాఫీసులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు పూర్తి చేసుకోవచ్చు.
* ఓటీపీ-ఆధారిత ప్రామాణీకరణ: వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) అథెంటికేషన్ ద్వారా లావాదేవీలకు అదనపు భద్రతను అందిస్తుంది.
* డాక్ సేవ యాప్: స్పీడ్ పోస్టులు, రిజిస్టర్ పోస్టులు, పార్సిళ్లు, బల్క్ బుకింగ్‌లను బుక్ చేసుకోవచ్చు, చెల్లింపులు చేయవచ్చు. ఇంటి వద్ద నుంచే ఈ సేవలను ఉపయోగించవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సమయానుకూలంగా పోస్ట్‌మెన్ ఇంటి వద్దకే వచ్చి వాటిని తీసుకెళతారు. దీనికి నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తారు.
* డాక్ పేతో డిజిటల్ చెల్లింపు: పోస్టాఫీసుల్లో ఇప్పటివరకూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేదు. తాజా మార్పుల్లో భాగంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ యూపీఐ చెల్లింపుల కోసం డాక్ పే యాప్ తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ఆధారంగా అన్నిరకాల యూపీఐ చెల్లింపులు చేసే వీలుంటుంది.
దశలవారీగా డిజిటల్ చెల్లింపులు
మరోవైపు, ఇప్పటికే ఉన్న పోస్టాఫీసు సేవల ప్రాంతాలను ఏకీకృతం చేస్తూ ప్రత్యేక డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇవి అన్ని రకాల మెయిల్, పార్శిల్‌లకు ఒకే చోటునుంచి డెలివరీని అందించనున్నాయి. ఈ డెలివరీ కేంద్రాలు ఆదివారం, సెలవు రోజులతో పాటు ఉదయం, సాయంత్రం డెలివరీ ఆప్షన్‌లతో సౌకర్యవంతమైన డెలివరీ సేవలను అందించనుంది. కొత్త సేవల ద్వారా సామాన్యులు ప్రతి చిన్న పనికీ పోస్టాఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతానికి డిజిటల్ చెల్లింపుల విధానం దశలవారీగా అమల్లోకి రానుంది. మొదట ప్రధాన పోస్టాఫీసుల్లో, ఆ తర్వాత పట్టణ ప్రాంతాలకు విస్తరించనున్నారు. చివరిగా గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో అమలు చేస్తారు.
ఇండియా పోస్ట్‌కు కొత్త యుగం
దేశంలోని పోస్టాఫీసుల డిజిటలైజేషన్ వల్ల లాజిస్టిక్స్, ఈ-కామర్స్ ద్వారా గణనీయమైన మార్పులను అందుకోనుంది. ఇండియా పోస్ట్‌కు ఉన్న విస్తృత, అత్యాధునిక డిజిటల్ సామర్థ్యాలతో లాజిస్టిక్స్ పరిశ్రమలో బలమైన పోటీదారుగా మారడానికి సిద్ధంగా ఉంది.






