GST Benefits: ధరలు తగ్గించిన మరిన్ని వాహన తయారీ కంపెనీలు

by S Gopi |

పన్ను రేట్ల తగ్గింపు బజాజ్, కేటీఎం మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ. 20,000 వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది.

GST Benefits: ధరలు తగ్గించిన మరిన్ని వాహన తయారీ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: తగ్గిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు వాహన తయారీ కంపెనీలు తగ్గింపు ధరల వివరాలను ప్రకటించాయి. మంగళవారం మరిన్ని టూ-వీలర్, కార్ల తయారీ కంపెనీలు ధరల వివరాలను వెల్లడించాయి. అందులో ప్రముఖ బజాజ్ ఆటో జీఎస్టీ సంస్కరణల ఫలాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తామని స్పష్టం చేసింది. పన్ను రేట్ల తగ్గింపు బజాజ్, కేటీఎం మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ. 20,000, త్రీ-వీలర్లపై రూ. 24,000 వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. మరో టూవీలర్ కంపెనీ యమహా సైతం అన్ని మోడళ్లపై రూ. 17,581 వరకు తగ్గిస్తున్నామని చెప్పింది. సవరించిన ధరల ప్రకారం, ఆర్15 మోటార్‌సైకిల్ రూ. 2.12 లక్షల నుంచి రూ. 1.94 లక్షలకు, రేజర్ బైక్ రూ. 7,759 తగ్గి రూ. 93,760కే అందుబాటులో ఉంటుందని కంపెనీ వివరించింది. ఇదే బాటలో కార్ల తయారీ కంపెనీలు కూడా తగ్గింపు ధరలను ప్రకటించాయి. హోండా కార్స్ ఇండియా తమ అన్ని కార్లపై రూ. 95,500 వరకు తగ్గించామని పేర్కొంది. కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కారుపై రూ. 95,500, సిటీ కారుపై రూ. 57,500, ఎలివేట్ రూ. 58,400 వరకు తగ్గుతాయని వెల్లడించింది. మరో కంపెనీ జీప్ ఇండియా కూడా తమ కార్లపై మోడల్, వేరియంట్‌ని బట్టి రూ. 1.26 లక్షల నుంచి రూ. 4.8 లక్షల వరకు తగ్గుతాయని వెల్లడించింది. ప్రీమియం కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) తన అన్ని మోడళ్లపై రూ. 4.5 లక్షల నుంచి రూ. 30.4 లక్షల వరకు తగ్గింపు అమలు చేస్తామని తెలిపింది. అలాగే, వోల్వో కార్ ఇండియా కూడా అన్ని మోడళ్లపై రూ. 6.9 లక్షల వరకు తగ్గిస్తామని పేర్కొంది.

Next Story