Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన మూడీస్

by S Gopi |

ప్రధానంగా రత్నాభరణాలు, వైద్య పరికరాలు, టెక్స్‌టైల్స్ పరిశ్రమలు ఎక్కువ నష్టాలను ఎదుర్కొనక తప్పదు.

Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన మూడీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ అనలిటిక్స్ భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికా ప్రకటించిన పరస్పర సుంకాల ప్రభావం కారణంగా ప్రస్తుత ఏడాదిలో దేశ జీడీపీ 6.1 శాతానికి తగ్గుతుందని అభిప్రాయపడింది. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నందున అమెరికా సుంకాలు అమలు చేస్తే ఎగుమతులు తీవ్రంగా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా రత్నాభరణాలు, వైద్య పరికరాలు, టెక్స్‌టైల్స్ పరిశ్రమలు ఎక్కువ నష్టాలను ఎదుర్కొనక తప్పదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మార్చిలో అంచనా వేసిన 6.4 శాతం నుంచి 6.1 శాతానికి వృద్ధి అంచనాను సవరించినట్టు మూడీస్ అనలిటిక్స్ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో ఈ ఏడాది ప్రారంభంలో యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను ప్రోత్సాహకాల ద్వారా ఆర్థికవ్యవస్థలో వినియోగం పెంచేందుకు మద్దతు లభిస్తుందని, ఫలితంగా ఇతర ఆర్థికవ్యవస్థలతో పోలిస్తే భారత్ వృద్ధిపై తక్కువ ప్రభావంగా ఉంటుందని వివరించింది. ఇది అమెరికా సుంకాల ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుందని మూడీస్ అభిప్రాయపడింది. తాజాగా పరస్పర సుంకం అమలును 90 రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశారు. అయితే, చైనా దిగుమతులపై మాత్రం 125 శాతం సుంకాన్ని తక్షణం అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం అనుసరించే తీరు కారణంగా అనిశ్చితి కొనసాగుతుందని, ఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లోలం తప్పదని మూడీస్ తెలిపింది. ఈ పరిణామాల వల్ల కొనుగోలు శక్తి బలహీనపడటం, వ్యాపారాలు అదనపు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గవచ్చు. సుంకాలు వాణిజ్య వ్యయాన్ని పెంచడంతో అవి ప్రపంచ వృద్ధి అవకాశాలను కూడా బలహీనపరుస్తాయని మూడీస్ పేర్కొంది.

Next Story