Microsoft: మరోసారి భారీ లేఆఫ్స్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్

by S Gopi |

అంతర్జాతీయంగా ఉన్న వివిధ విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం ఉండనుంది.

Microsoft: మరోసారి భారీ లేఆఫ్స్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు లేఆఫ్స్ ప్రకటించిన కంపెనీ, మే నెలలో ఆరు వేల మందిని, ఆ తర్వాత జూన్‌లో మరో 300 మందిని తొలగించింది. తాజాగా అంతకుమించి సంస్థ ఉద్యోగుల్లో 4 శాతానికి సమానమైన దాదాపు 9,100 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనుంది. అంతర్జాతీయంగా ఉన్న వివిధ విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం ఉండనుంది. ఇదే గనక అమలైతే మైక్రోసాఫ్ట్‌లో 2023 తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యోగాల కోత అవుతుందని సియాటిల్ టైమ్స్ బుధవారం తన కథనంలో పేర్కొంది. ఏఐ (కృత్రిమమేధ)లో భారీగా పెట్టుబడులు పెట్టడం, కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా కొత్త లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్ రంగంలో మారుతున్న మార్కెట్‌ ధోరణిని అనుసరించి వ్యాపారంలో విజయం సాధించడానికి పలు విభాగాల్లో ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సంస్థాగత మార్పుల కోసం తొలగింపులు చేపడుతున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఇమెయిల్‌లో పేర్కొన్నారు. కాగా, 2024, జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నవారు 2,28,000 మంది ఉన్నారు.

Next Story