Microsoft: మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

by S Gopi |

ఇతర విభాగాల్లో ఉన్నవారిని కూడా వదిలించుకునే దిశగా కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Microsoft: మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ముఖ్యంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) విభాగంలో ఎక్కువ పెడ్డుబడులను పెడుతున్న కారణంగా కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఈసారి లేఆఫ్స్ ప్రక్రియలో భాగంగా మైక్రోసాఫ్ట్ సేల్స్ విభాగంలో వేలాది మంది ఉద్యోగులను తగ్గించడానికి సిద్ధమవుతోంది. వచ్చే నెలలో దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. అందరినీ ఒకేసారి తొలగించకుండా, ఈ ఏడాది ఆఖరు వరకు లేఆఫ్స్ ప్రక్రియను చేపడుతుంది. అత్యధికంగా సేల్స్ విభాగంలోని వారే ప్రభావితమైనప్పటికీ, ఇతర విభాగాల్లో ఉన్నవారిని కూడా వదిలించుకునే దిశగా కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలో దీనిపై తుది నిర్ణయం జరగవచ్చు. ఇదివరకు కంపెనీ మే నెలలో 6,000 మందిని తొలగించింది. ఈసారి అదే స్థాయిలో తొలగింపులు ఉండవచ్చని బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది.

ప్రధానంగా వేగవంతమైన టెక్ రంగంలో పోటీని ఎదుర్కొని, ఏఐపై ఎక్కువ దృష్టి సారించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఇదే సమయంలో ఏఐ టూల్స్, సేవలకు సంబంధించిన వ్యాపారాల నుంచి డిమాండ్ పెరుగుతుండటం కూడా కంపెనీ నిర్ణయానికి కారణం. దీనికోసం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు, ఏఐ పరిశోధనకు ఎక్కువ నిధులను ఖర్చు చేయనుంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మైక్రోసాఫ్ట్ దాదాపు రూ. 6.6 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని అంచనా వేస్తోంది. ఈ ఖర్చులో ఎక్కువ భాగం డేటా సెంటర్ మౌలిక సదుపాయాల విస్తరణకు ఉపయోగిస్తుంది. గత సంవత్సరం జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 2.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Next Story