Instagram: భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్

by S Gopi |

ఈ కొత్త సర్వీస్ టీనేజర్‌లకు ఆన్‌లైన్‌లో బిల్ట్-ఇన్ సేఫ్టీ, ప్రైవసీ, పేరెంట్ కంట్రోల్ సౌకర్యాలను అందిస్తుంది.

Instagram: భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు తీసుకొచ్చిన టీన్ అకౌంట్ సదుపాయాన్ని భారత్‌లోనూ ప్రవేశపెట్టింది. పిల్లల జీవితాలపై సోషల్ మీడియా ప్రభావంపై పెరిగిన ఆందోళనల నేపథ్యంలో మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను అమెరికాతో పాటు యూకే సహా పలు దేశాల్లో ప్రారంభించింది. ఇప్పుడు భారత్‌లోనూ దీన్ని ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త సర్వీస్ టీనేజర్‌లకు ఆన్‌లైన్‌లో సురక్షితమైన బ్రౌజింగ్, బిల్ట్-ఇన్ సేఫ్టీ, ప్రైవసీ, పేరెంట్ కంట్రోల్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ టీన్ అకౌంట్స్ డిఫాల్ట్‌గా ప్రైవేట్‌లో ఉంటాయని, 16 ఏళ్లలోపు యూజర్లు దీన్ని మార్చుకునేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మెటా వివరించింది. టీన్ అకౌంట్ ఉన్నవారు ఇప్పటికే ఫాలో అవడం లేదా కనెక్ట్ అయిన అకౌంట్ల నుంచి మాత్రమే మెసేజ్‌లు పొందుతారు. వారిని మాత్రమే ట్యాగ్ చేసే వీలుంటుంది. ముఖ్యంగా సెన్సిటివ్ కంటెంట్‌పై పూర్తిస్థాయిలో నియంత్రణ ఉంటుంది. 18 ఏళ్ల లోపు వారు అకౌంట్ ప్రారంభించినా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. రోజువారి యాప్ వాడకం 60 నిమిషాలు దాటాక నోటిఫికేషన్ రావడం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడ్ ఆన్‌లో ఉంటుందని మెటా తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి నోటిఫికేషన్లు రావని పేర్కొంది.

Next Story