AI Skill: భారత్‌లో ఏఐ స్కిల్స్ కొరత

by S Gopi |   (  Updated:2025-03-10 14:01:05  IST  )

2027 నాటికి దేశీయ ఏఐ రంగం 10 లక్షల కంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను ఎదుర్కొంటుందని..

AI Skill: భారత్‌లో ఏఐ స్కిల్స్ కొరత
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ భవిష్యత్తులో గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్‌గా మారనుందనే చర్చ విపరీతంగా జరుగుతోంది. అయితే, దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) స్కిల్స్‌కు సంబంధించి నెలకొన్న కొరత కారణంగా ఈ ఘనతను సాధించడం కీలక సమస్యగా ఉందని ఓ అధ్యయనం తెలిపింది. అధునాతన సాంకేతికత, ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ నైపుణ్యాల కొరత దాని పురోగతిని ఆటంకం కలిగిస్తోంది. 2027 నాటికి దేశీయ ఏఐ రంగం 10 లక్షల కంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను ఎదుర్కొంటుందని బైన్ అండ్ కంపెనీ తన అధ్యయనంలో తేల్చింది. ఏఐ స్కిల్ డిమాండ్‌ను తీర్చేందుకు భారత్ తన శ్రామిక శక్తిలో స్కిల్స్‌ను పెంచే చర్యలు తప్పనిసరి అని నివేదిక అభిప్రాయపడింది. గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్‌గా ఎదిగేందుకు భారత్‌కు ప్రత్యేక అవకాశం ఉంది. దీనివల్ల 2027 నాటికి ఏఐ రంగంలో ఉద్యోగ అవకాశాలు 1.5-2 రెట్లు పెరుగుతాయని అంచనా.

ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో గణనీయమైన రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ ద్వారా దీన్ని సాధించవచ్చని నివేదిక సూచించింది. తద్వారా ఏఐ రంగం వచ్చే రెండేళ్లలో 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఇందులో 10 లక్షల కంటే ఎక్కువమందికి రీస్కిల్లింగ్ అవసరం ఉంటుంది. 2019 నుంచి ఏఐ సంబంధిత ఉద్యోగాలు ఏటా 21 శాతం పెరుగుతున్నాయి. డిమాండ్ పెరుగుదల, మెరుగైన జీతాలు ఉన్నప్పటికీ సరైన ఏఐ టాలెంట్ ఉన్న ఉద్యోగుల సరఫరా జాబ్ మార్కెట్లో లభించడంలేదు. దీనివల్ల పరిశ్రమ అనుకున్న దానికంటే తక్కువ వృద్ధిని కలిగి ఉంది. ఏఐ స్కిల్స్ కొరత ముఖ్యమైన సవాలే అయినప్పటికీ, త్వరలో దీన్ని భారత్ అధిగమిస్తుందనే నమ్మకం ఉంది. కంపెనీలు సాంప్రదాయ నియామక విధానాలకు మించి నిర్ణయాలు తీసుకోవాలి. నిరంతరం స్కిల్స్‌ను పెంచే చర్యలు తీసుకోవాలి, ఉద్యోగులకు అలాంటి అవకాశం కల్పించే సదుపాయాలను కొనసాగించాలని నివేదిక పేర్కొంది.

Next Story