Maruti Suzuki: 5-స్టార్ రేటింగ్‌తో కొత్త ఎస్‌యూవీ లాంచ్ చేసిన మారుతీ సుజుకి

by S Gopi |

అత్యాధునిక ఫీచర్లతో పాటు భద్రతలోనూ రాజీ పడకుండా మారుతీ సుజుకి ఈ కారును డిజైన్ చేసింది.

Maruti Suzuki: 5-స్టార్ రేటింగ్‌తో కొత్త ఎస్‌యూవీ లాంచ్ చేసిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ మారుతీ సుజుకి ఎస్‌యూవీ విభాగంలో మరో కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. చిన్న కార్లకు తగ్గుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మిడ్-రేంజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో ఫ్రాంక్స్, బ్రెజా, జిమ్నీ, గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీ మోడళ్లను అందిస్తున్న కంపెనీ బుధవారం తన కొత్త 'విక్టోరిస్' మోడల్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో పాటు భద్రతలోనూ రాజీ పడకుండా మారుతీ సుజుకి ఈ కారును డిజైన్ చేసింది. ధరలతో పాటు బుకింగ్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. సాధారణంగా మారుతీ సుజుకి కార్లలో భద్రత ఫీచర్లు తక్కువనే చర్చ జరుగుతూ ఉంటుంది. దీన్ని పటాపంచలు చేస్తూ, కంపెనీ తన విక్టోరిస్ కారు బీఎన్‌క్యాప్ క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించడం విశేషం. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులతో పాటు మన దేశ మార్కెట్లో తొలి లెవల్-2 అడాస్ టెక్నాలజీని అందించింది. అలాగే, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ లాంటి కీలక ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ ఫీచర్లలోనూ కంపెనీ అత్యాధునిక ఆప్షన్లు ఇందులో తీసుకొచ్చింది. 10.1 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో-ఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 360 కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్ సహా అనేక ఫీచర్లు అందిస్తోంది. మిస్టిక్ గ్రీన్, ఎటర్నల్ బ్లూ సహా మొత్తం 10 రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Next Story