Maruti Suzuki: కారు కొనేవారికి మారుతీ సుజుకి అద్భుతమైన 'లోన్ స్కీమ్'

by S Gopi |

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ‘సుహానా సఫర్’ స్కీమ్‌ను కంపెనీ తీసుకొచ్చింది.

Maruti Suzuki: కారు కొనేవారికి మారుతీ సుజుకి అద్భుతమైన లోన్ స్కీమ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్తగా కారు కొనాలనుకునే వారికోసం ప్యాసింజర్ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న కార్ల కొనుగోలుదారుల్లో డౌన్ పేమెంట్ కట్టలేక కారు కొనుగోలును వాయిదా వేసుకునే కస్టమర్ల కోసం కంపెనీ కొత్త ఫైనాన్స్ పథకాన్ని తీసుకొచ్చింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ‘సుహానా సఫర్’ స్కీమ్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఇది ఆర్‌డీ-ఆధారిత ఆటో లోన్ పథకం. ప్రస్తుతం ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వాగన్ ఆర్ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంది. ఈ పథకం కింద కస్టమర్ ముందుగా బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) ఖాతా తెరిచి మూడు నుంచి ఆరు నెలల పాటు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేయాలి. సాధారణంగా అంచనా ఈఎంఐలో సుమారు 80 శాతం మొత్తాన్ని ఆర్‌డీలో జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, నెలవారీ ఈఎంఐ రూ. 10,000గా ఉంటే, కస్టమర్ నెలకు సుమారు రూ. 8,000 ఆర్‌డీలో పొదుపు చేస్తారు. మెచ్యూరిటీ అనంతరం ఆ మొత్తం, వడ్డీతో కలిపి, కారు కొనుగోలుకు డౌన్ పేమెంట్‌గా ఉపయోగపడుతుంది.

ఆర్‌డీ కాలం పూర్తైన తర్వాత కస్టమర్ అదే బ్యాంకు నుంచి సాధారణ కారు లోన్ తీసుకుని ఈఎంఐ చెల్లించవచ్చు. కారు కొనుగోళ్లను ప్రోత్సహించడానికి వాహనం డెలివరీ అనంతరం చివరి నెల ఆర్‌డీ వాయిదాను మారుతి డీలర్లు తిరిగి చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించారు. అంటే, ఒకరంగా చివరి వాయిదా క్యాష్ డిస్కౌంట్ అనుకోవచ్చు. చిన్న కార్ల విభాగంలో డిమాండ్‌ను మరింత పెంచే లక్ష్యంతో భవిష్యత్తులో ఇతర బ్యాంకులను కూడా భాగస్వామ్యంలో చేరుకోనున్నట్టు కంపీఎ వెల్లడించింది.

Next Story