Turkish jewellery: టర్కిష్ డిజైన్, అమ్మకాలను నిలిపేసిన ఆభరణాల వ్యాపారులు

by S Gopi |

అక్షయ తృతీయ రోజున దేశీయంగా జరిగిన బంగారం అమ్మకాల్లో టర్కిష్ డిజైన్ ఆభరణాలదే అగ్రస్థానం కావడం గమనార్హం.

Turkish jewellery: టర్కిష్ డిజైన్, అమ్మకాలను నిలిపేసిన ఆభరణాల వ్యాపారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య పాక్‌కు మద్దతిచ్చిన టర్కీకి భారత వ్యాపారులు దెబ్బ మీద దెబ్బలు వేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారుల సమాఖ్య అన్ని వ్యాపారాలను నిలిపేయాలని నిర్ణయించింది. తాజాగా ఆభరణాల వ్యాపారులు కూడా టర్కీ నుంచి దిగుమతి అయ్యే టర్కిష్-డిజైన్ ఆభరణాల అమ్మకాలు, ప్రదర్శనను బహిష్కరించాలని నిర్ణయించారు. ఇటీవల అక్షయ తృతీయ రోజున దేశీయంగా జరిగిన బంగారం అమ్మకాల్లో టర్కిష్ డిజైన్ ఆభరణాలదే అగ్రస్థానం కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశ ఆభరణాలు బహిష్కరణకు గురయ్యాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా టర్కీ తీరు భారత్‌కు వ్యతిరేకంగా ఉందని, అందుకే వారి ఆభరణాలను దిగుమతి చేయకూడదనే నిర్ణయించినట్టు లక్నోకు చెందిన చౌక్ సరాఫా అసోసియేషన్ వైస్-ప్రెసిడెంట్ ఆదిష్ జైన్ అన్నారు. టర్కీ నుంచి దిగుమతి చేసుకునే ఆభరణాల్లో ప్రధానంగా నెక్లెస్‌లు, ఉంగరాలు, చెవిదుద్దులు వంటివి ఉంటాయి. దేశంలో ఒకరోజులో విక్రయించే 20 నెక్లెస్‌లలో ఐదు టర్కీకి చెందినవే ఉంటాయని, మొత్తం అమ్మకాల్లో ఆ దేశ డిజైన్ ఆభరణాల వాటా 25 శాతం ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే టర్కిష్ ఆభరణాల అమ్మకాలను ఆపేశాం. ఆర్డర్లను కూడా రద్దు చేసుకున్నామని లక్నో మహానగర్ సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు మనీశ్ కుమార్ పేర్కొన్నారు.

Next Story