LPG Crisis: ఫుడ్ డెలివరీలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్‌పీజీ సంక్షోభం

by S Gopi |

ఎల్‌పీజీ గ్యాస్ కొరత వల్ల డెలివరీ ఏజెంట్లకు పనుల్లేవని పేర్కొంది. రెస్టారెంట్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్‌లు, క్యాటరింగ్ సేవలు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ దుకాణాలను మూసేయాల్సి వచ్చింది.

LPG Crisis: ఫుడ్ డెలివరీలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్‌పీజీ సంక్షోభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్లు ఎల్‌పీజీ గ్యాస్ కొరత వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి కొన్ని రంగాలలో ధరలు పెరుగుదల, తక్కువ ఉత్పత్తి లాంటి ఆందోళనలను రేకెత్తిస్తోంది. అయితే, ఈ సంక్షోభం ఫుడ్ డెలివరీ రంగంపైనా ఎక్కువగా ఉందని, పూర్తిగా ఈ రంగం కార్యకలాపాలు దెబ్బతినేల ఉన్నాయని గిగ్ వర్కర్స్ యూనియన్ చెబుతోంది. దీనికి సంబంధించి గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్(జీఐపీఎస్‌డబ్ల్యూయూ) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఎక్కువ సమస్యను సృష్టించింది. దీనివల్ల డెలివరీ ఏజెంట్లకు పనుల్లేవని పేర్కొంది. రెస్టారెంట్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్‌లు, క్యాటరింగ్ సేవలు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ దుకాణాలను మూసేయాల్సి వచ్చింది.

ఇప్పటికే జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆర్డర్లు 50-60 శాతం క్షీణించాయి. డెలివరీ ఏజెంట్ల నుంచి తమకు పెద్ద ఎత్తున ఎంక్వైరీలు వస్తున్నాయి. రోజుకు 30 డెలివరీలు చేసే ఉద్యోగులు కూడా ఇప్పుడు 5-10 మాత్రమే చేస్తున్నారు. డెలివరీలు తగ్గిపోవడం వల్ల కంపెనీలు కూడా ఏజెంట్ల ఐడీలను ఇన్-యాక్టివ్ చేసే ప్రమాదం ఉంది. దీని పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని యూనియన్ తెలిపింది. గిగ్ కార్మికులకు స్థిరమైన వేతనాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు లేవని, సరఫరా షాక్‌లు, ఆర్థిక అంతరాయాల సమయంలో వారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అత్యవసర జోక్యం కోరుతూ కేంద్ర కార్మిక శాఖకు లేక రాశామని యూనియన్ పేర్కొంది. అందులో ప్రధానంగా ఆహార వ్యాపారాలకు 24 గంటల ఎల్‌పీజీసీ సరఫరా, జొమాటో, స్విగ్గీ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లు డెలివరీ ఏజెంట్లకు రూ. 10,000 తక్షణ పరిహారం చెల్లించాలని, వారి ఐడీలపై 3 నెలల మారటోరియం, రోజువారీ ప్రోత్సాహకాలు, సామాజిక భద్రత కోడ్-2020 కింద పూర్తి గిగ్ వర్కర్ కవరేజ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Next Story