- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డోర్ స్టెప్ సేవలతో ‘లైఫ్ సర్టిఫికెట్’ మరింత సులువు
పింఛన్ దారుల కోసం ప్రభుత్వం డిజిటల్ ‘జీవన్ ప్రమాణ్’, ‘ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్’ విధానాన్ని తీసుకొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పింఛన్ దారుల కోసం ప్రభుత్వం డిజిటల్ ‘జీవన్ ప్రమాణ్’, ‘ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్’ విధానాన్ని తీసుకొచ్చింది. పెన్షనర్లు తమ పెన్షన్ కొనసాగించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ లో తమ జీవన్ ప్రమాణ్ సమర్పించాలి. అయితే 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుంచి కాకుండా అక్టోబర్ 1 నుంచే ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
మిగతావారు నవంబర్ 1 నుంచి 30 లోపు ఇవ్వడానికి వీలు ఉంటుంది. అయితే, గతంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి పెన్షనర్లు స్వయంగా బ్యాంకు లేదంటే పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను ఉపయోగించి ఎక్కడి నుంచైనా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. పీఎస్‌బీ అలయన్స్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల కస్టమర్లు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ సర్వీసులను డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్(డీఎల్‌సీ) అంటారు. ఇతర ప్రాంతాలు లేదా దూరంగా ఉన్న పింఛన్ దారులు ప్రతి ఏడాది పెన్షన్ ఏజెన్సీకి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది మరింత కష్టమైన పని. దీని పరిష్కారానికి ప్రభుత్వం 2014లో జీవన్ ప్రమాణ్ పేరుతో సర్టిఫికెట్ జారీని డిజిటల్ రూపంలోకి తెచ్చింది. దీని ద్వారా బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. పెన్షనర్ల వద్ద కంప్యూటర్, మొబైల్ లాంటి పరికరాలు లేకుంటే సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) లేదా పోస్టాఫీస్, బ్యాంకు శాఖలకు వెళ్లి అసవరమైన వివరాలను సమర్పించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. పెన్షర్లకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు ఇప్పటికే లైఫ్ సర్టిఫికెట్ కోసం డోర్ స్టెప్ సేవలు అందిస్తున్నాయి. వయసు, అనారోగ్య కారణాలతో బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లలేని పింఛన్ దారులకు డోర్ స్టెప్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
డోర్‌స్టెప్ సేవలు ఇలా..
* ముందుగా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఖాతా ఉన్న బ్యాంకును ఎంచుకుని లైఫ్ సర్టిఫికెట్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత పెన్షన్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* మొబైల్ నెంబర్ ఇప్పటికే నమోదు చేసి ఉంటే కస్టమర్ తన 6 అంకెల పిన్/6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి.
* అభ్యర్థన పూర్తిచేసిన తర్వాత, ఏజెంట్ పేరు వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది.
* బ్యాంకు ఏజెంట్ ఇంటి వద్దే లైఫ్ సర్టిఫికెట్ సబ్ మిషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. ఎలాంటి చార్జీలు ఉండవు.
అవసరమయ్యే డాక్యుమెంట్లు
* పెన్షన్ ఐడీ
* పెన్షన్ పేమెంట్ ఆర్డర్
* బ్యాంక్ ఖాతా వివరాలు
* మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ
* ఆధార్ నెంబర్






