- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Computers: కంప్యూటర్లు కొనడం కష్టమే
ఇందుకు ప్రధానంగా ప్రాసెసర్లు, ర్యామ్, జీపీయూల వంటి కంప్యూటర్ విడిభాగాల ధరలు ఖరీదవడమే.

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్తగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ కొనాలనుకునే వారికి ధరల షాక్ తగలనుంది. ఎందుకంటే, ఈ ఏడాది వీటి ధరలు ఏకంగా 35 శాతం వరకు పెరగనున్నాయనే సంకేతాలు ఊపందుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ప్రాసెసర్లు, ర్యామ్, జీపీయూల వంటి కంప్యూటర్ విడిభాగాల ధరలు ఖరీదవడమే. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం అత్యంత విపరీతంగా పెరగడంతో పాటు, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య సవాళ్లు ధరల పెరుగుదలకు కారణం. ముఖ్యంగా డిమాండ్, సరఫరా సమస్యల వల్ల డీడీఆర్ ర్యామ్ ధరలు భారంగా మారాయి. ర్యామ్ ధరలు ఇప్పటికే రెండున్నర నుంచి 3 రెట్లు పెరిగాయి. ఫలితంగా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల తయారీకి అయ్యే ఖర్చు భారీగా పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు, ఇంటెల్ నుంచి ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్ల కొరత కూడా దీనికి అదనం. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
2026లో పరిస్థితులు మరింత కష్టంగా ఉండనున్నాయి. పెరుగుతున్న విడిభాగాల ధరల కారణంగా, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు ఇప్పటికే ఖరీదయ్యాయి. వీటికి తోడు ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్ల కొరత పరిశ్రమకు సవాలుగా మారింది. వీటి కొరత కారణంగా సీపీయూలు మార్కెట్లో అందుబాటులో లేవు. ఏఐ ఆధారిత వర్క్‌లోడ్స్ కోసం హై-పెర్ఫార్మెన్స్ చిప్స్ డిమాండ్ పెరగడంతో సాధారణ ల్యాప్‌టాప్ సీపీయూల ధరలు, లభ్యత కష్టంగా మారింది. ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లలో ఉపయోగించే మెమొరీ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్ కూడా కంప్యూటర్ ఖర్చులను పెంచుతున్నాయి. మరోవైపు, ఎనర్జీ, పెట్రోకెమికల్ సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత వంటి గ్లోబల్ సవాళ్లు కూడా సెమీకండక్టర్ల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి.
ఎంత పెరుగుతాయ్
ఇప్పటివరకు, అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు 10–12 శాతం పెరగ్గా, ఈ మార్చిలో మరో 8–10 శాతం, ఏడాది ఆఖర్లో మరో 10 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు, గతంలో రూ. 30,000–రూ. 35,000 మధ్య ఖరీదు చేసే కంప్యూటర్లు రూ. 45,000కి చేరనున్నాయి. రాబోయే 6–7 త్రైమాసికాల వరకు ధరలు పెరుగుతూనే ఉండొచ్చని, 2027 ద్వితీయార్థం తర్వాతే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
తొందపడుతున్న సంస్థలు
ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సంస్థలు, చిన్న కంపెనీలు తమ కంప్యూటర్లను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసే పనిలో పడ్డాయి. ముందుగానే కొనడం ద్వారా 2026 ప్రథమార్థంలో ఖర్చుల భారం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నాయి.
ఆఫర్లు
రానున్న నెలల్లో అధిక ధరలు, డిమాండ్ క్షీణతను దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ బ్రాండ్లు నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వాటిపై ఆఫర్లు, రాయితీ, సులభ ఫైనాన్సింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.






