- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
National Employment Policy: 'నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ' తెచ్చే యోచనలో కేంద్రం
ఈ పాలసీ నైపుణ్యాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. తద్వారా ఉద్యోగార్థులు మెరుగైన ఉద్యోగాలను వెతుక్కోవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ప్రతి కార్మికుడికి రక్షణ, ఉత్పాదకత, భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్రం 'నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ' తీసుకురావడంపై పని చేస్తోంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శ్రమ శక్తి నీతి-2025 పేరుతో నేషనల్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ పాలసీ ముసాయిదాను బుధవారం విడుదల చేసింది. అసంఘటిత రంగం నుంచి ఎక్కువ మందిని సాధారణ, సురక్షితమైన ఉద్యోగాల్లోకి తీసుకురావడం దీని లక్ష్యం. ఈ పాలసీ నైపుణ్యాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. తద్వారా ఉద్యోగార్థులు మెరుగైన ఉద్యోగాలను వెతుక్కోవచ్చు. ముఖ్యంగా తయారీ, పర్యాటకం, సేవలు వంటి ఎక్కువ అవసరం ఉన్న రంగాల్లోకి వెళ్లవచ్చు. ఈ పాలసీ ద్వారా కార్యాలయాలను సురక్షితంగా మార్చడంతో పాటు ఉద్యోగులకు ఆరోగ్య బీమా, పెన్షన్లు వంటి సామాజిక భద్రతను అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో కంపెనీల నియమ, నిబంధనలను సులభతరం చేయనుంది. దానివల్ల కంపెనీలు ఎక్కువ మందిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రధానంగా మహిళలు, యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడంపైనే ఈ పాలసీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికి సంబంధించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం కార్మిక సర్వేలు, ఈ-శ్రమ్ పోర్టల్ నుంచి రియల్ డేటాను ఉపయోగిస్తోంది. అసంఘటిత రంగంలో ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు రివార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కొత్త పాలసీని తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు/ఉద్యోగులకు సహాయంగా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.






