Kotak Mahindra Bank: సేవింగ్స్ అకౌంట్లలో సొమ్ముపై వడ్డీ తగ్గించిన కోటక్ మహీంద్రా బ్యాంక్

by S Gopi |

సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీని 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.

Kotak Mahindra Bank: సేవింగ్స్ అకౌంట్లలో సొమ్ముపై వడ్డీ తగ్గించిన కోటక్ మహీంద్రా బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో సొమ్ముకు వర్తించే వడ్డీ రేట్లలో కోత విధించింది. రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షలు, ఆపైన బ్యాలెన్స్ ఉండే సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీని 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. తద్వారా రూ. 5-50 లక్షల మొత్తంపై వడ్డీ రేటును 3.50 శాతం నుంచి 3 శాతానికి, రూ. 50 లక్షలు ఆపైన ఉన్న మొత్తంపై వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గించింది. రూ. 5 లక్షల్లోపు ఉన్న మొత్తంపై కూడా 3 శాతం వడ్డీనే లభిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. నాన్-రెసిడెంట్ ఖాతాలకు కూడా ఇవే వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంకు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు సోమవారం(ఫిబ్రవరి 17) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును రెండేళ్ల తర్వాత 6.50 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటక్ మహీంద్రా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల తక్కువ వడ్డీ రేట్ల కారణంగా ప్రజల చేతుల్లో తక్కువ నగదు ఉంటుంది. సాధారణంగా బ్యాంకు ప్రతి త్రైమాసికానికి ఒకసారి వడ్డీని లెక్కించి జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31, మార్చి 31 తేదీల్లో ఖాతాదారులకు చెల్లిస్తుంది.

Next Story