Financial Changes: బ్యాంకు లావాదేవీల్లో భారీ మార్పులు.. నేటి నుంచి అమలుకానున్న నియమాలివే!

by S Gopi |

ఈ మార్పులు బ్యాంకు కస్టమర్లు, క్రెడిట్ కార్డు హోల్డర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి

Financial Changes: బ్యాంకు లావాదేవీల్లో భారీ మార్పులు.. నేటి నుంచి అమలుకానున్న నియమాలివే!
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2025 ఏడాది ముగింపునకు వచ్చేసింది. కొత్త ఏడాదికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రతి నెలా మాదిరిగానే నవంబర్‌లోనూ ఆర్థికపరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. అందులో ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ సవరణ చట్టం వల్ల బ్యాంకు ఖాతా విషయంలో నామినీ నిబంధనలు, క్రెడిట్‌ కార్డ్‌ నియమాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ గడువు వంటివి ఉన్నాయి. ఈ మార్పులు బ్యాంకు కస్టమర్లు, క్రెడిట్ కార్డు హోల్డర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి, కాబట్టి ఆ వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు

నవంబర్ 1 నుంచి బ్యాంకు ఖాతాదారులు డిపాజిట్ అకౌంట్, లాకర్లు ఉన్నవారు నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏదైనా సందర్భంలో బ్యాంకు ఖాతాదారు మరణిస్తే ఒక్క నామినీ వల్ల సదరు వ్యక్తి అందుబాటులో లేకపోవడం, లేదంటే క్లెయిమ్ చేసుకోకపోవడం ఇబ్బందిగా మారింది. వీటి పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఒకేసారి నలుగురిని నామినీలుగా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ఎవరికి ఎంత శాతం కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు జీవిత భాగస్వామికి 50 శాతం, మిగిలిన మొత్తం పిల్లలకు కేటాయించవచ్చు. నలుగురు నామినీలను వరుస క్రమంలో కూడా ఎంచుకునే వీలుంటుంది. అంటే, మొదటి నామినీ అందుబాటులో లేకపోతే, రెండో నామినీకి, ఆ వ్యక్తి కూడా లేకుంటే మూడో వ్యక్తి క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ కార్డ్

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఎడ్యుకేషన్‌ ఫీజు, వ్యాలెట్‌ లోడింగ్‌ కోసం నవంబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి తీసుకొచ్చింది. క్రెడ్, చెక్, మొబిక్విక్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై ఇప్పుడు లావాదేవీ మొత్తంలో 1 శాతం వర్తిస్తుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ వెబ్‌సైట్లు, పీఓఎస్‌ మెషీన్‌ల వద్ద చేసే చెల్లింపులకు ఈ ఫీజు వర్తించదని స్పష్టం చేసింది. అలాగే, రూ. 1,000 దాటిన ప్రతి వ్యాలెట్ లోడ్ లావాదేవీపై 1 శాతం ఫీజు ఉంటుందని పేర్కొంది.

లైఫ్ సర్టిఫికేట్

పెన్షన్ తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ 1 నుంచి 30వ తేదీలోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు తాము జీవించి ఉన్నట్టు ఈ సర్టిఫికేట్ ధృవీకరిస్తుంది. పెన్షన్ చెల్లింపుల్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఏటా దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. 80 ఏళ్లు పైబడిన వారికి అక్టోబర్ 1 నుంచే ఈ ప్రక్రియ మొదలైంది.

యూపీఎస్ గడువు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్‌పీఎస్) నుంచి ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్)కి మారడానికి గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. ఈ గడువు అర్హత కలిగిన ప్రస్తుత ఉద్యోగులు, గతంలో పదవీ విరమణ చేసినవారు, ఎన్‌పీఎస్ కింద ఉండి మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వాములకు వర్తిస్తుంది.

ఫాస్టాగ్ కొత్త నిబంధనలు

నవంబర్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్‌హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. నో యువర్ వెహికల్ (కేవైవీ) ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని వాహనాల కోసం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. అయితే, భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్ఏఐ) ఈ ప్రక్రియను సరళీకృతం చేసింది. దీన్ని పూర్తి చేయడానికి అదనపు సమయం ఇచ్చింది. కాబట్టి ఆయా వాహనాలకు ఫాస్టాగ్ సేవలను నిలిపివేయరు. కానీ, ఫాస్టాగ్స్ జారీ చేసిన బ్యాంకులు రిమైండర్‌లను పంపుతూనే ఉంటాయి.

అలాగే, కేవైవీ ప్రొసీజర్ పూర్తి చేయడానికి ఇకపై కార్లు, ఇతర వాహనాల సైడ్ ఫోటోలు అవసరం లేదు. ఫాస్టాగ్, నంబర్ ప్లేట్ కనిపించే విధంగా ముందు నుంచి తీసిన ఫోటోలు మాత్రమే అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా వాహన్ వెబ్‌సైట్లో వాహనం నంబర్, ఛాసిస్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే, ఇకపై వాహన్ వెబ్‌సైట్ నుంచి ఆటోమేటిక్‌గా వెహికల్ ఆర్‌సీ వివరాలు కనిపిస్తాయి. అదేవిధంగా, ఒకే మొబైల్ నంబర్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ వాహనాలు రిజిస్టర్ చేసి ఉంటే, యూజర్లు ఏ వాహనానికి కేవైవీ పూర్తి చేయాలనే ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Next Story