Retail Inflation: జూన్‌లో మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం

by S Gopi |

గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.74 శాతంగా నమోదవగా, పట్టణాల్లో అది 3.92 శాతమే ఉంది.

Retail Inflation: జూన్‌లో మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూన్ నెలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగి ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతాన్ని దాటింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 3.93 శాతం ఉండగా, జూన్‌లో 4.38 శాతానికి చేరింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆహార ధరలే. ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.32 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.74 శాతంగా నమోదవగా, పట్టణాల్లో అది 3.92 శాతమే ఉంది. అలాగే గ్రామీణ భారతంలో ఆహార ద్రవ్యోల్బణం 5.45 శాతం ఉండగా, పట్టణాల్లో 5.09 శాతంగా నమోదైంది.

ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.05 శాతం, అల్లం ధరలు అత్యధికంగా పెరిగి 50.41 శాతానికి చేరగా, టొమాటో ధరలు 31.92 శాతం పెరిగాయి. ప్రధాన వస్తువుల్లో వెండి ఆభరణాల ద్రవ్యోల్బణం 133.21 శాతం, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాల ద్రవ్యోల్బణం 36.82 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు బంగాళాదుంపల ధరలు 20.34 శాతం తగ్గగా, బఠానీలు, జీలకర్ర, మోటార్ కార్లు, జీపులు, మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు కూడా ఏడాది క్రితంతో పోలిస్తే తగ్గాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో అత్యధికంగా 6.36 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి (5.39 శాతం), తమిళనాడు (5.24 శాతం), ఒడిశా (5.15 శాతం) నిలిచాయి. మరోవైపు త్రిపురలో అత్యల్పంగా 1.65 శాతం ద్రవ్యోల్బణం నమోదవగా, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ కూడా తక్కువ ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

Next Story