- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కపుల్స్‌కు ఆప్షనల్ జాయింట్ ఐటీఆర్.. పన్ను భారం తగ్గేనా?
రాఘవ్ చద్దా ప్రపోజ్ చేసిన కపుల్ ఐటీఆర్ ఫైలింగ్ గురించి నేడు దేశమంతా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో : మనదేశంలో పరిమితి దాటి ఆదాయం ఉన్నవారు సాధారణంగా ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. అయితే భార్యాభర్తలు ఒకే ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా? దీనికి ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఇలాంటి ప్రక్రియ సాధ్యమేనా? వంటి విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకు.. రెండు కుటుంబాలు ఒకే సంవత్సరంలో ఒకే మొత్తం ఆదాయాన్ని సంపాదిస్తాయి. కానీ ఒక కుటుంబం సున్నా పన్ను చెల్లిస్తుండగా, మరొక కుటుంబం కొన్ని లక్షల పన్ను చెల్లిస్తుంది. ఇది అన్యాయంగా అనిపిస్తోందా? పెళ్లైన జంటలకు ఉమ్మడి పన్ను దాఖలు అనే ఒక కొత్త ఆలోచన, సరిగ్గా ఈ అంతరాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో తన పదునైన ప్రశ్నలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఈ అంశాన్ని ప్రస్తావించారు. దంపతులు ఆప్షనల్‌గా ఉమ్మడి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలని సూచించారు. దంపతులు తమ ఆర్థిక వ్యవహారాలను చాలావరకు కలిసే నిర్వహిస్తున్నప్పుడు, పన్నులను కూడా కలిసే ఎందుకు దాఖలు చేయకూడదు? అని ప్రశ్నించారు. దీంతో దీనిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఇప్పుడున్న వ్యవస్థలోని అంతరం..
ప్రస్తుతం మనదేశం వ్యక్తిగత పన్ను విధానాన్ని అనుసరిస్తోంది. దంపతులైనా విడివిడిగా పన్ను దాఖలు చేయాల్సిందే. దీని గురించి మఖిజాని గెరా అండ్ అసోసియేట్స్ ట్యాక్స్ హెడ్ గౌరవ్ మఖిజాని వివరిస్తూ.. ‘ఆప్షనల్ జాయింగ్ ఫైలింగ్ విధానం, వేర్వేరు ఆదాయాలు ఉన్న కుటుంబాలు తమ ఆదాయాన్ని కలిపి, పన్ను శ్లాబులను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం జీవిత భాగస్వాములలో ఒకరు చాలా తక్కువ సంపాదిస్తున్నప్పుడు (లేదా ఏమీ సంపాదించనప్పుడు), వారికి లభించే ప్రాథమిక మినహాయింపు, తక్కువ శ్లాబు ప్రయోజనాలు వాడుకోకుండా ఉండిపోతున్నాయి. దీనర్థం ఆదాయం సమానంగా ఉన్న కుటుంబాలతో పోలిస్తే, ఒక వ్యక్తి మాత్రమే సంపాదించే కుటుంబాలు ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తోంది’ అని పేర్కొన్నారు.
చాలా కుటుంబాల్లో ఒక్కరే..
ఉదాహరణకు.. ఒక కుటుంబంలోని జీవిత భాగస్వాములు ఇద్దరూ చెరో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. మరొక కుటుంబంలో ఒకరు మాత్రమే రూ. 24 లక్షలు సంపాదిస్తున్నారు, మరొకరికి ఆదాయం లేదు. రెండు కుటుంబాల మొత్తం సంపాదన సమానంగా ఉన్నప్పటికీ, రెండవ కుటుంబం సుమారు రూ. 3 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు కలిసి జాయింట్ ఫైలింగ్ చేస్తే, సంపాదించే వ్యక్తి, తన భాగస్వామికి చెందిన పన్ను ప్రయోజనాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా మొత్తం కుటుంబం చెల్లించాల్సిన పన్ను తగ్గుతుంది. కానీ, ఇందులోనూ సవాళ్లున్నాయి. ఉమ్మడి ఐటీఆర్ కింద శ్లాబులు, మినహాయింపులను ప్రభుత్వం ఎలా రూపొందిస్తుందనే దానిపై ఆధారపడి వాస్తవంలో ఆదా చేయడానికి వీలవుతుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అంత సులభమేమీ కాదు..
ఉదాహరణకు.. ఇద్దరు భాగస్వాములు సంపాదించే కుటుంబం ఉమ్మడి ఫైలింగ్ చేసే ప్రక్రియ మరింత క్లిష్టతరం కావచ్చు. ఆదాయాలు, మినహాయింపులు, పన్ను క్రెడిట్‌లను ఒకే రిటర్న్‌లో కలపడానికి ఎక్కువ పని, సమన్వయం అవసరం. ప్రధానంగా జవాబుదారీతనం అనే సమస్య కూడా ఉంటుంది. ఫైలింగ్‌లో పొరపాటు జరిగితే, ఇద్దరూ ప్రభావితం కావచ్చు. అలాగే పన్ను ప్రయోజనాలను అందించే ఏ వ్యవస్థలోనైనా దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంటుంది. తగిన భద్రతా చర్యలు లేకపోతే, ఉమ్మడి ఫైలింగ్ విధానంలో దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంది. విడిపోయిన దంపతులు కూడా కేవలం పన్ను ఆదా కోసమే ఉమ్మడి ఐటీఆర్ ఫైల్ చేస్తే కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
ఇతర దేశాల్లో ఎలా ఉంది?..
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే ఉమ్మడి ఐటీఆర్ ఫైలింగ్‌ను అనుమతిస్తున్నాయి. కానీ, మనదేశం ఎప్పుడూ వ్యక్తిగత విధానాన్నే అనుసరిస్తోంది. ఇలాంటి మార్పును చేపట్టాలంటే పన్ను నిబంధనలు, వ్యవస్థలు, ఫైలింగ్ ప్రక్రియలలో భారీ అప్‌డేట్‌లు అవసరం. టీడీఎస్ క్రెడిట్ల నుంచి రిటర్న్ ఫారాల వరకు, ప్రతిదీ ఒకే పద్ధతికి తీసుకురావాల్సి ఉంటుంది. భారత్‌లో ఆప్షనల్ జాయింట్ ఫైలింగ్‌ను తీసుకురావడం అంటే ప్రస్తుత వ్యవస్థ నుంచి అతిపెద్ద మార్పు తీసుకురావడమే. ఇది సాధ్యమే అయినప్పటికీ, దీనికి ప్రణాళిక, చట్టపరమైన మార్పులు అవసరమని నిపుణులు భావిస్తున్నారు.






