- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు సృష్టించిన జియో.. తొలిసారి రూ.30వేల కోట్ల ప్రాఫిట్: ఆకాశ్ అంబానీ
2025-26 ఆర్థిక సంవత్సరంలో జియోకు రూ.30,000 కోట్ల ఆదాయం సమకూరినట్లు రిలయన్స్ జియో ఇన్ ఫ్రాకామ్ చైర్మన్, జియో ప్లాట్ ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 ఆర్థిక సంవత్సరంలో జియోకు రూ.30,000 కోట్ల ఆదాయం సమకూరినట్లు రిలయన్స్ జియో ఇన్ ఫ్రాకామ్ చైర్మన్, జియో ప్లాట్ ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. శనివారం నిర్వహించిన రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో డిజిటల్ రంగంలో జియో సాధించిన రికార్డు విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను ఆయన వెల్లడించారు. జియో హిస్టరీలోనే తొలిసారి పన్నులు చెల్లించగా వచ్చిన లాభం రూ.30 వేల కోట్ల మార్కును దాటి కొత్త రికార్డును సృష్టించినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో జియో వినియోగదారుల సంఖ్య 52.4 కోట్లకు చేరిందని, దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా జియో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందన్నారు.
దేశాన్ని పూర్తిగా 5G దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ఆకాష్ అంబానీ తెలిపారు. జియో నెట్వర్క్ లో ఉన్న వినియోగదారులందరినీ 2030 నాటికి పూర్తిగా 5G నెట్వర్క్ కు మారుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో జియో 5G యూజర్ల సంఖ్య 26.8 కోట్లకు చేరుకుందని తెలిపారు. చైనా వెలుపల ఒకే దేశంలో ఇంత భారీ స్థాయిలో 5G యూజర్లు ఉన్న ఏకైక టెలికాం ఆపరేటర్ జియో మాత్రమేనని పేర్కొన్నారు. గడిచిన ఏడాదిలోనే 7.7 కోట్ల మంది కొత్త 5G కస్టమర్లు జియోలో చేరారని, అలాగే జియో నెట్‌వర్క్‌లో సగటున ఒక్కో వినియోగదారుడి నెలవారీ డేటా వినియోగం 42.3 GBకి చేరిందని, ఇది ప్రపంచంలోనే అత్యధిక వినియోగ స్థాయిలలో ఒకటి అని ఆయన వెల్లడించారు.
దేశంలోని ప్రతి మూలకూ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తీసుకెళ్లడమే జియో లక్ష్యమని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 1.3 కోట్లకు పైగా ఇళ్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లభించిందని తెలిపారు. ప్రస్తుతం జియో ఎయిర్‌ఫైబర్ నెట్‌వర్క్ ఎంత వేగంగా విస్తరిస్తోందంటే, ప్రతిరోజూ సుమారు 60,000 కొత్త ఇళ్లు ఈ సేవల పరిధిలోకి వస్తున్నాయని వివరించారు. భారతీయ కార్పొరేట్ సంస్థలతో పాటు, దేశంలోని చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలను డిజిటలైజ్ చేయడం జియో మూడవ అతిపెద్ద వ్యూహాత్మక ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. వినియోగదారులకు మరింత సులువైన, స్మార్ట్, వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి జియో అప్పుడే కన్స్యూమర్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అనుసంధానించడం ప్రారంభించిందని ఆకాష్ అంబానీ వెల్లడించారు. సాధారణ టెలికాం సంస్థ స్థాయి నుండి గ్లోబల్ డిజిటల్ లీడర్‌గా జియో వేగంగా ఎదుగుతోందని ఆయన ప్రసంగం ద్వారా స్పష్టమైంది.






