- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CAIT: అక్షయ తృతీయకు రూ. 16,000 కోట్ల ఆభరణాల వ్యాపారం
గతేడాది అక్షయ తృతీయ రోజున రూ.73,500గా ఉన్న బంగారం ధరలు ప్రస్తుతం 10 గ్రాములు రూ.లక్షకు చేరుకున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ఈసారి అక్షయ తృతీయకు దేశీయ ఆభరణాల మార్కెట్లో బంగారం, వెండి కొనుగోళ్లకు పెద్ద డిమాండ్ ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది బంగారం ధరలు ఊహకందని స్థాయిలో పెరగడమే ఇదుకు కారణం. పసిడి తులం రూ. లక్ష మార్కును చేరుకోవడంతో బుధవారం జరిగే అక్షయ తృతీయ రోజున రూ. 16,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రెసిడెంట్ పంకజ్ అరోరా అంచనా వేశారు. ఈ ఏడాది పండుగకు దేశవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్ మిశ్రమంగా ఉండనుందని సీఏఐటీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది అక్షయ తృతీయ రోజున రూ.73,500గా ఉన్న బంగారం ధరలు ప్రస్తుతం 10 గ్రాములు రూ.లక్షకు చేరుకున్నాయి. అదేవిధంగా, వెండి ధరలు కిలోగ్రాముకు రూ. 1,00,000కి చేరుకున్నాయి, 2023లో కిలోగ్రాముకు రూ.86,000గా ఉంది. సాధారణంగా, అక్షయ తృతీయ కొనుగోళ్లలో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. అయితే ఈ సంవత్సరం పెరిగిన ధరలు వినియోగదారుల డిమాండ్‌ను ప్రభావితం చేశాయని పంకజ్ అరోరా పేర్కొన్నారు.
ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన 12 టన్నుల బంగారం, రూ. 4 వేల కోట్ల విలువైన 400 టన్నుల వెండి విక్రయాలు జరగవచ్చని, మొత్తంగా రూ.16 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటం, సురక్షితమైన ఆస్తిగా బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం బంగారం, వెండి ధరలను పెంచాయి. వీటికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు కూడా ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు జ్యువెలర్లు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. అయినప్పటికీ అధిక ధరలు డిమాండ్‌ను బలహీనపరిచే అవకాశాలు ఉన్నాయని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా పేర్కొన్నారు.






