IT Industry: ఈ ఏడాది ఐటీ పరిశ్రమలో తక్కువ వేతనాల పెరుగుదల

by S Gopi |

2025లో ఐటీ ఉద్యోగుల వేతనం సగటున 4-8.5 శాతం మధ్య పెరగవచ్చు.

IT Industry: ఈ ఏడాది ఐటీ పరిశ్రమలో తక్కువ వేతనాల పెరుగుదల
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది భారత ఐటీ సేవల రంగంలో జీతాల పెరుగుదల మధ్యస్థంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, స్కిల్స్ ఉన్న ఉద్యోగుల విషయంలో పెరుగుతున్న డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) వినియోగం, ఖర్చులు, వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో ఐటీ ఉద్యోగుల వేతనం సగటున 4-8.5 శాతం మధ్య పెరగవచ్చు. ఇది గత కొన్నేళ్లతో పోలిస్తే అత్యల్పమని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్-ప్రెసిడెంట్ కృష్ణ విజ్ చెప్పారు. చాలా కంపెనీలు మొత్తం ఖర్చులో జీతాల కోసం కేటాయించడంలో కొంత జాగ్రత్త వహిస్తున్నాయి. ఇప్పటికే ఇంక్రిమెంట్లు ఇచ్చే ప్రక్రియను ఏప్రిల్-జూన్ త్రైమాసికం తర్వాత కాలానికి మార్చారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే జీతాలను పెంచే విషయంలో కంపెనీలు ఆలోచిస్తున్నాయని ఆమె తెలిపారు. నైపుణ్యం ఆధారంగా జీతాలిచ్చే అంశాన్ని కంపెనీలు పరిశీలిస్తున్నాయి. అలాగే, జీతాలను పెంచే బదులు బోనస్‌లు, ఈఎస్ఓపీలు, ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. వివిధ స్థాయిలలో ఉద్యోగుల జీతాల పెరుగుదలలో మార్పులు ఉంటాయని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోతియాని తెలిపరు. సీనియర్ స్థాయిల్ ఉద్యోగులు, ముఖ్యంగా ఏఐ సంబంధించి స్కిల్స్ ఉన్నవారికి జీతాలు దాదాపు రెండంకెల స్థాయిలో కూడా పెరగవచ్చని ఆమె పేర్కొన్నారు.

Next Story