UNDP : ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలోకి

by S Gopi |

మానవ అభివృద్ధి పురోగతిలో దేశం కొంత నష్టాన్ని చూడక తప్పదని ఐక్యరాజ్యసమితి అంచనాలు వెల్లడిస్తున్నాయి.

UNDP : ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలోకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత్‌పైన మరింత ప్రభావం చూపనున్నాయి. ఈ పరిణామాల వల్ల మనదేశంలో 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని, అలాగే మానవ అభివృద్ధి పురోగతిలో దేశం కొంత నష్టాన్ని చూడక తప్పదని ఐక్యరాజ్యసమితి అంచనాలు వెల్లడిస్తున్నాయి. 'మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు: ఆసియా, పసిఫిక్ ప్రాంత మానవ అభివృద్ధిపై ప్రభావాలు' అనే శీర్షికతో ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) విడుదల చేసిన నివేదికలో.. ఈ యుద్ధం అధిక ఇంధనం, రవాణా, ముడిసరుకుల ఖర్చుల ద్వారా ఆసియా, పసిఫిక్ ప్రాంతమంతటా మానవాభివృద్ధిపై ఒత్తిళ్లను పెంచుతోంది. ఇది దేశంలోని ప్రజల కొనుగోలు శక్తిని, ఆహార భద్రతను తగ్గిస్తోంది. ప్రభుత్వ బడ్జెట్లపై భారం మోపడమే కాకుండా, జీవనోపాధిని బలహీనపరుస్తోందని నివేదిక పేర్కొంది.

ఇరాన్ యుద్ధ పరిస్థితుల తర్వాత దేశంలో పేదరికం రేటు 23.9 శాతం నుంచి 24.2 శాతానికి పెరుగుతుందని, దీనివల్ల 24,64,698 మంది ప్రజలు పేదరికంలోకి వెళ్తారని నివేదిక తెలిపింది. సంక్షోభానికి ముందు 35,15,69,000 మంది పేదరికంలో ఉండగా, సంక్షోభం తర్వాత దేశంలో ఈ సంఖ్య సుమారుగా 35,40,33,698కి చేరుతుందని నివేదిక అంచనా వేస్తోంది. మరోవైపు, ఈ యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా 88 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయే ప్రమాదంలో ఉన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఆసియా-పసిఫిక్‌కు 299 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 27.82 లక్షల కోట్ల) వరకు నష్టం వాటిల్లవచ్చు. చైనాలో పేదరికంలోకి జారిపోయే ప్రమాదంలో ఉన్న వారి సంఖ్య సుమారు 1,15,000 నుంచి 6,20,000కు పైగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.

Next Story