Russia: అమెరికా-ఇరాన్ యుద్ధంతో రష్యాకు భారీ లాభాలు

by S Gopi |

ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేయడం, గ్లోబల్ క్రూడ్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో రష్యా చమురుకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.

Russia: అమెరికా-ఇరాన్ యుద్ధంతో రష్యాకు భారీ లాభాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఓవైపు పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంటే, మరోవైపు, ఈ ఉద్రిక్తతల మధ్య రష్యా మెల్లగా భారీ లాభాలు చూస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరా తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. తమపై దాడులకు ప్రతిగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేయడం, గ్లోబల్ క్రూడ్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో రష్యా చమురుకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా భారత్, చైనా లాంటి దేశాలకు రష్యా చమురు ఎగుమతులు 50 శాతం మేర పెరిగినట్టు అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులకు, ఈ చమురు ఆదాయం ఆసరాగా నిలిచిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

రెట్టింపు లాభాలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం వల్ల రష్యాకు తన చమురు పన్నుల నుంచి వచ్చే ఆదాయం ఏప్రిల్‌లో రెట్టింపు పెరిగి 9 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 83 వేల కోట్ల)కు చేరుకోవచ్చని గురువారం రాయిటర్స్ వెల్లడించింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఇంధన సంక్షోభానికి కారణమైందని చమురు వ్యాపారులు భావిస్తున్న ఇరాన్ యుద్ధం వల్ల, రష్యాకు అనూహ్య లాభం చేకూరుతుందనడానికి రాయిటర్స్ లెక్కలు నిజం చేస్తున్నాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై జరిగిన వైమానిక దాడుల తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో బ్రెంట్ ఫ్యూచర్స్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిపోయాయి.

రష్యా వ్యూహం

ఇక్కడే రష్యా వ్యూహం పనిచేసింది. 2024లో రష్యా ఏళ్లుగా కొనసాగిస్తున్న ముడి చమురు ఎగుమతిపై సుంకాన్ని రద్దు చేసింది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తిపై విధించే ఖనిజ వెలికితీత పన్ను(మినరల్ ఎక్స్‌ట్రాక్సన్ ట్యాక్స్)ను పెంచింది. ఇది ప్రతినెలా ప్రపంచ మార్కెట్ల ఆధారంగా మారుతుంది. దీనివల్ల మార్చిలో రష్యా చమురు ఆదాయం 327 బిలియన్ రూబుల్స్ నుంచి ఏప్రిల్‌లో సుమారు 700 బిలియన్ రూబుల్స్(9 బిలియన్ డాలర్లు) పెరగనుంది. ఇది గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ ఆదాయమని రాయిటర్స్ లెక్కలు పేర్కొన్నాయి.

రష్యా తన బడ్జెట్ కేటాయింపుల్లో 2026 ఏడాది మొత్తానికి ఖనిజ వెలికితీత పన్ను నుంచి 7.9 ట్రిలియన్ రూబుల్స్‌ ఆదాయం వస్తుందని భావిస్తోంది.

రష్యాలో ఇంధన గిరాకీ

ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, పన్నుల కోసం ఉపయోగించే రష్యా యురల్స్ ముడి చమురు సగటు ధర మార్చిలో బ్యారెల్‌కు 77 డాలర్లకు పెరిగింది, ఇది అక్టోబర్ 2023 తర్వాత అత్యధికం. అలాగే, ఫిబ్రవరిలోని బ్యారెల్‌కు 44.59 డాలర్లతో పోలిస్తే 73 శాతం అధికం కావడం గమనార్హం. చమురు, గ్యాస్ మార్కెట్ల పునాదులను కదిలిస్తున్న తీవ్రమైన ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య, వివిధ దేశాల నుంచి రష్యా ఇంధనం కోసం భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని క్రెమ్లిన్ చెబుతోంది.

రష్యాకు వచ్చే ఈ లాభాలు అంతిమంగా ఇరాన్ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు వెల్లడించారు.

Next Story