Exports: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత ఎగుమతిదారుల్లో ఆందోళన

by S Gopi |

ప్రపంచ వాణిజ్యానికి పరిస్థితి మరింత కష్టమవుతుందని ముంబైకి చెందిన ఎగుమతిదారు ఎస్ కె సరాఫ్ సరాఫ్ అన్నారు,

Exports: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత ఎగుమతిదారుల్లో ఆందోళన
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల మూలంగా భారత ఎగుమతులతో సహా ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో వాయు, సముద్ర మార్గాల్లో సరుకు రవాణా రేట్లు పెరుగుతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా యూరప్‌, రష్యాలకు వెళ్లే ఎగుమతులు ప్రభావితమవుతాయని అంటున్నారు. వివాదం ఎక్కువ కాలం కొనసాగితే, ఇరాన్, యూఏఈ మధ్య హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం వంటి మార్గాల్లో వ్యాపార నౌకల కదలిక ప్రభావితమవుతాయి. ఫలితంగా ప్రపంచ వాణిజ్యం దెబ్బతినవచ్చు. సరుకు రవాణా ఖర్చుతో పాటు బీమా వ్యయం కూడా పెరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్‌సీ రాల్హాన్ అన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఒక వారం పాటు కొనసాగితే, ప్రపంచ వాణిజ్యానికి పరిస్థితి మరింత కష్టమవుతుందని ముంబైకి చెందిన ఎగుమతిదారు, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపక ఛైర్మన్ ఎస్ కె సరాఫ్ సరాఫ్ అన్నారు, ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములని ఆయన తెలిపారు. ఇటీవలే ఎర్ర సముద్ర మార్గాలు సాధారణ స్థితికి మారాయి. భారత్, ఆసియాలోని ఇతర ప్రాంతాల నుంచి అమెరికా, యూరప్ వెళ్లే ఎగుమతులకు 15-20 రోజులు ఆదా అయ్యాయి. ఇప్పుడు మళ్లీ యుద్ధం వారం పాటు కొనసాగితే సరుకు రవాణా ఖర్చులు 50 శాతం పెరుగుతాయని వివరించారు.

2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడితో ప్రారంభమైన ప్రస్తుత వివాదం, హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడుల కారణంగా ఎర్రసముద్ర మార్గాల ద్వారా సరుకు రవాణా నిలిచిపోయింది. తిరుగుబాటుదారులపై దాడులతో అమెరికా జోక్యం చేసుకున్న తర్వాత, వాణిజ్య నౌకలపై కాల్పులు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఎర్ర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తున్న్న క్రమంలో ఈసారి హార్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యూరప్‌తో భారత వాణిజ్యంలో దాదాపు 80 శాతం ఎర్ర సముద్రం గుండా వెళుతుంది. అమెరికాతో ఉన్న వాణిజ్యం కూడా ఈ మార్గంలోనే జరుగుతుంది. ఈ రెండు భౌగోళిక ప్రాంతాలు దేశ మొత్తం ఎగుమతుల్లో 34 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచ కంటైనర్ ట్రాఫిక్‌లో 30 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం జలసంధి కీలకమైనది. అమెరికా టారిఫ్ ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం 2025లో 0.2 శాతం బలహీనపడుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది.

Next Story