Stock Market: ఇన్వెస్టర్లకు రూ. 13 లక్షల కోట్ల లాభం

by S Gopi |

అంతకుముందు సెషన్‌లో బడ్జెట్ ప్రభావంతో లాభాలు చూసిన సూచీలు, ఈసారి యూఎస్-ఇండియా డీల్ ఖరారైన నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్లకు పైగా రాణించింది.

Stock Market: ఇన్వెస్టర్లకు రూ. 13 లక్షల కోట్ల లాభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల పంట పండింది. కొన్ని నెలల నుంచి స్తబ్దుగా ఉన్న మార్కెట్లలో మంగళవారం ఒక్కసారిగా రికార్డు ర్యాలీ కనిపించింది. సోమవారం రాత్రి ఆలస్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత ఇవ్వడంతో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. అంతకుముందు సెషన్‌లో బడ్జెట్ ప్రభావంతో లాభాలు చూసిన సూచీలు, ఈసారి యూఎస్-ఇండియా డీల్ ఖరారైన నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్లకు పైగా రాణించింది. నిఫ్టీ సైతం 600 పాయింట్లకు పైగా దూసుకెళ్లడంతో వరుసగా రెండో సెషన్‌లో ర్యాలీ కొనసాగించాయి. ఈ లాభాలతో 2025, మే 12 తర్వాత అంటే దాదాపు ఎనిమిది నెలల్లో ఇదే అతిపెద్ద సింగిల్-డే ర్యాలీ అని విశ్లేషకులు తెలిపారు. ఈ భారీ లాభాలతో మంగళవారం ఒక్కరోజే మదుపర్ల సంపద రూ. 12.75 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 467.10 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2072.67 పాయింట్లు పుంజుకుని 83,739కి చేరింది. నిఫ్టీ 639.15 పాయింట్లు లాభపడి 25,727 వద్దకు చేరింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 5.1 శాతం, 4.9 శాతం వరకు పెరిగాయి, ఇది మార్కెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సింగిల్-డే ర్యాలీలలో ఒకటిగా నిలిచింది. ఈ ర్యాలీలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెన్సెక్స్‌లో ఏకంగా 9.12 శాతం పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ 6.68 శాతం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ వరుసగా 4-6 శాతం మధ్య లాభపడ్డాయి.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, భారీగా బలపడిన మన కరెన్సీ రూపాయి విలువ కారణంగా దేశీయ ఈక్విటీల ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. యూఎస్-ఇండియా డీల్‌కు సంబంధించి భారతీయ వస్తువులపై టారిఫ్‌ను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల అభివృద్ధి చెందుతున్న మనలాంటి మార్కెట్లలో పోటీ పెరగనుంది. ఇది టెక్స్‌టైల్స్, ఆక్వా, రత్నాలు, ఔషధాల వంటి అమెరికాకు ఎక్కువ ఎగుమతి అయ్యే రంగాలకు మద్దతు లభించనుంది. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు తిరిగి మన ఈక్విటీల్లోకి వస్తాయనే అంచనాలు కూడా ఈ స్థాయి ర్యాలీకి కారణమని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. వీటితో పాటు ఎగుమతి ఆధారిత, కమోడిటీ సంబంధిత స్టాక్‌లు, ముఖ్యంగా టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఆటో అనుబంధ రంగాలు ఈ ర్యాలీకి దోహదపడ్డాయి. ఫైనాన్షియల్స్, రియల్టీ, ఫార్మా, ఐటీ రంగాలు కూడా లాభాలు పొందాయి.

రూపాయి రెండున్నర వారాల గరిష్ఠం

భారత రూపాయి బలమైన ఆసియా కరెన్సీగా మారింది. ఒక్కరోజులోనే 122 పైసలు పెరిగి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ. 90.27 వద్ద ఉంది. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే 122 పైసలు లేదా 1.33 శాతం లాభపడింది. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా భారత రూపాయి రెండున్నర వారాల గరిష్ట స్థాయికి చేరుకుందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.

Next Story