India-US: మరో 48 గంటల్లో భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం?

by S Gopi |

మిగిలిన రంగాల కంటే కీలకమైన వ్యవసాయ, పాడి పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో భారత్, అమెరికా మధ్య సఖ్యత కుదరట్లేదు.

India-US: మరో 48 గంటల్లో భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం?
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో 48 గంటల్లో ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జూలై 9తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ గడువు ముగియనున్న నేపథ్యంలో చర్చలను సాధ్యమైనంత త్వరగా మధ్యంతర ఒప్పందం సంతకానికి భారత్ ప్రయత్నిస్తోంది. రెండు దేశాల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. మిగిలిన రంగాల కంటే కీలకమైన వ్యవసాయ, పాడి పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో భారత్, అమెరికా మధ్య సఖ్యత కుదరట్లేదు. ఒప్పందంలో వ్యవసాయం, ఆటోమొబైల్‌, ఇండస్ట్రియల్‌ గూడ్స్‌, లేబర్‌ ఇంటెన్సివ్‌ ప్రొడక్ట్‌ల పైనే దృష్టిపెట్టినప్పటికీ, వ్యవసాయం, పాడి పరిశ్రమల మార్కెట్‌ను విదేశీ కంపెనీలకు పూర్తిస్థాయిలో తెరిచే ఉద్దేశం భారత్‌కు లేదు. అమెరికా కొన్నిరకాల గూడ్స్‌కు, ఆటోమొబైల్‌ రంగాలకు సంబంధించి డిస్కౌంట్లను కోరుతోంది. ఈవీ కార్లు, వైన్, పెట్రోకెమికల్స్‌, డెయిరీ, యాపిల్‌, నట్స్‌, జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో అమెరికా ఎక్కువ ఒత్తిడి చేస్తోంది. జన్యుపరంగా మార్పులు చేసిన పంటలకు మార్కెట్‌ తెరవాలని వాషింగ్టన్ డిమాండ్ చేసింది. కానీ వ్యవసాయ ఆధారితంగా ఉన్న భారత్, అదే గనక జరిగితే మనదేశంలోని రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టాలు ఉంటాయని భావిస్తోంది.

భారత్ కూడా దుస్తులు, తోలు, పాదరక్షలు వంటి శ్రమతో కూడిన వస్తువులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని కోరింది. అదేవిధంగా, జూలై 9కి ముందు రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే, అమెరికాకు భారత ఎగుమతులు 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని, 26 శాతం పరస్పర సుంకాలను ఎదుర్కోక తప్పదు. దానివల్ల మొత్తం సుంకం 36 శాతానికి చేరుకుంటుంది. ఒప్పంద చర్చల్లో భారత్‌ ఈ అంశాన్ని కూడా లేవనెత్తింది, 26 శాతం పన్నుపై రాయితీ ఇవ్వాలని కోరింది.

Next Story