Small Savings Schemes: మరోసారి చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లలో మార్పులేదు

by S Gopi |

వరుసగా ఐదవ త్రైమాసికంలో పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజనా పథకాల్లో పొదుపుపై ప్రస్తుత వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి.

Small Savings Schemes: మరోసారి చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లలో మార్పులేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా ఐదవ త్రైమాసికంలో పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజనా లాంటి పథకాల్లో పొదుపుపై ప్రస్తుత వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి. ఇప్పుడున్న వడ్డీ రేట్లు 2025, జూన్ 30 వరకు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. సుకన్య సమృద్ధి పథకం కింద డిపాజిట్లపై మొత్తాలకు 8.2 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుత త్రైమాసికంలో 7.1 శాతంగా ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకంపై 7.7 శాతం, వికాస్ పత్ర పథకంపై 7.5 శాతం కొనసాగనుంది. పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై కూడా ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుత 4 శాతం వడ్డీయే కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరించారు.

Next Story